నా కులం గురించి మాట్లాడుతున్నారు: పిండ ప్రదానం చేసిన హీరో శివాజీ
అమరావతి: కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ సంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాల్లో భాగంగా గురువారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద పిండ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా శివాజీ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్న వారికి కూడా పిండాలు పెట్టినట్లు తెలిపారు. హోదా కోసం పోరాడుతోన్న తనపై పలువురు విమర్శలు చేస్తున్నారని, వైసీపీ నేతలు తన కులం గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఏ కులం కోసమో ఉద్యమం చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నానని అన్నారు. ఏపీలోని పాలక, ప్రతిపక్షాలు హోదా కోసం సరైన రీతిలో పోరాడడం లేదని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్యాకేజీ ఇవ్వడం వల్ల ఎలాంటి లాభం లేదని వ్యాఖ్యానించారు.
ఏపీలోనే పుట్టానని, ఏపీ రుణం తీర్చుకుంటానని అన్నారు. హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటోన్న రాజకీయకులు నిజాయతీగా పోరాడడం లేదని అన్నారు. కేంద్రం ఏపీకి ప్యాకేజీ ఇస్తే... ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజీలకు అంగీకరించొద్దని రాజకీయనేతలకు సూచించారు.
ఇక కృష్ణా పుష్కరాలు ఏడోరోజకు చేరుకున్నాయి. శ్రావణ పౌర్ణమి కావడంతో గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. విజయవాడలోని దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, పవిత్ర సంగమం ఘాట్, గుంటూరు జిల్లాలోని అమరావతి, కర్నూలు జిల్లాల్లోని శ్రీశైలం, సంగమేశ్వరం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications