వ్యాపారస్తులు ఉంటే ఇలాగే: ఎంపీలపై శివాజీ ఫైర్, 'దేశంలో భాగమే అనిపిస్తే హోదా ఇవ్వండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పిన కేంద్రం పైన, బిజెపి పైన నటుడు శివాజీ బుధవారం నాడు ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది పార్టీలకు సంబంధించిన సమస్య కాదని, ప్రజలకు సంబంధించినదని శివాజీ చెప్పారు.
రాజకీయ పార్టీలు ఇప్పటికైనా స్పందించాలని, వ్యాపారులను పార్లమెంటుకు పంపొద్దని, వ్యాపారస్తులే ఎంపీలుగా వెళ్లడంతో ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదని ఆరోపించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం చెప్పిందని, ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు ఈ విషయమై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కేంద్రమంత్రి వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగాలని, రాజీనామాలతో ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు.

చట్టంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు: కంభంపాటి
ఏపీకి ప్రత్యేక హోదాను అప్పుడే చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు చెప్పారు. ఐదేళ్లు కాదు.. పదేళ్లని బిజెపి పోరాడిందని, ఇప్పుడు కేంద్రంలో, అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం సరికాదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా పై వెనుకడుగు వేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు కేంద్రం సాయం చేయాలన్నారు. దీనిపై తమ వంతు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
దేశంలో భాగం అనిపిస్తే ఇవ్వండి: చలసాని
ఏపీ ప్రజలు దేశంలో భాగమే అని భావిస్తే, పార్లమెంటులో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే సహాయనిరాకరణ ఉద్యమం చేపడతామన్నారు.
దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమేనన్నారు. ఈ విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తూ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలో జరిగే పరిణామాలకు బిజెపిదే బాధ్యత అన్నారు. హోదాపై ఉద్యమం తప్పదన్నారు.












Click it and Unblock the Notifications