హైకోర్టులో ఉద్యోగులకు ఊరట- జీతం నుంచి రికవరీ చేయద్దు : చర్చలు ఆరంభం..!!
ఏపీలో కొనసాగుతన్న పీఆర్సీ వివాదంలో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో ప్రభత్వం...ఉద్యోగ సంఘాల నేతలు మధ్య చర్చలు మొదలయ్యాయి. పీఆర్సీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీని పైన విచారణ చేస్తూ ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచీ రికవరీ చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

మంత్రులతో ఉద్యోగ నేతల భేటీ
ఇదే సమయంలో...మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం వంటి అంశాలతోపాటు హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, రికవరీ అంశాలు, జనవరి నెల, పాత వేతనాలపై మంత్రుల కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పుకొచ్చారు. స్ట్రగుల్ కమిటీ నిర్ణయించిన సమ్మె.. కార్యాచరణ వాయిదా వేసుకోవాలని సూచించారు.

సానుకూలంగా చర్చలు
అదే విధంగా రెండు వైపుల నుంచి మరిన్ని చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. ఇక, హైకోర్టు తీర్పు పైన సజ్జల స్పందించారు. అసలు రికవరీ అనేదే పీఆర్సీలో లేదని ..దీంతో.. అసలు, ఆ అంశమే ఉత్పన్నం కాదని సజ్జల స్పష్టం చేసారు. అయితే, ఐఆర్ కు సంబంధించి మాత్రం అది సర్దబాట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు చేసే ప్రతిపాదనలు విన్నామని.. ప్రభుత్వం నుంచి వాటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వంలో చర్చలు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, మొత్తంగా నిర్ణయం మారే అవకాశం లేకపోయినా.. సాధ్యమైనంత వరకు ఉద్యోగులను ఒప్పించే ప్రయత్నం చేస్తామని సజ్జల చెప్పుకొచ్చారు.

సమ్మె నివారించే ప్రయత్నాలు
ఇక.. ఈ నెల 3వ తేదీన ఛలో విజయవాడ కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన అంశం పైనా ఆయన స్పందించారు. అటువంటి కార్యక్రమాలు వద్దనే తాము కోరుతున్నామని... కోవిడ్ కారణంగా ఆ పిలుపు సరి కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రెండు వైపుల నుంచి సానుకూలంగా సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు - ప్రభుత్వం రెండు వైపుల నుంచి ఈ చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణకు ఉద్యోగ సంఘాల నేతలు సహకరిస్తున్నారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలనే భావనతో ఉద్యోగ సంఘాలు సైతం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications