గ్రామ, వార్డు సచివాలయాలపై చట్టబద్దతపై హైకోర్టు కీలక ఆదేశాలు...!!
గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్దినెన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఏపీ హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఖాకీ డ్రెస్ వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని.. సాధారణ పోలీసుల మాదిరిగా బందోబస్తు, నైట్ డ్యూటీలు వేస్తున్నారని పేర్కొన్నారు
ఆర్డినెన్స్ పై వివరాలు కోరుతూ : ఏపీ ప్రభుత్వం వార్డు, గ్రామ సచివాలయాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రజల వద్దకే సుపరిపాలన అందించే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా హైకోర్టులో జరిగిన విచారణ సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిందో లేదో వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు, కొందరు మహిళా కార్యదర్శులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు న్యాయస్థానంలో విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.
మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు : మహిళా శిశు సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న వీరిని పోలీసు శాఖకు జత చేస్తూ మహిళా పోలీసుగా పేరుమార్చారని తెలిపారు. ఖాకీ డ్రెస్ వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని.. సాధారణ పోలీసుల మాదిరిగా బందోబస్తు, నైట్ డ్యూటీలు వేస్తున్నారని వెల్లడించారు.
గ్రామ..వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాలపరిమితి జూన్ 7 తోనే ముగిసిందన్నారు. అది చట్టంగా రూపుదాల్చలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిందో లేదో వివరాలు సమర్పించాలని జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వం స్పష్టత : అడ్వకేట్ జనరల్ తన వాదనల్లో మహిళా పోలీసులుగా మాత్రమే వారిని పిలుస్తారని..కానిస్టేబుల్ విధులను వారు నిర్వహించటం లేదన్నారు. యూనిఫాం ధరించారరన్న కారణంతో వారిని రెగ్యులర్ పోలీసులుగా చూడకూడదన్నారు. అత్యుత్సాహంతో ఎవరైనా మహాళా కానిస్టేబుళ్లకు బందోబస్తు, రాత్రి వేళల్లో విధులు వేసి ఉంటారని పేర్కొన్నారు.
అలాంటి ఘటనలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఆర్దినెన్స్ పై స్పష్టత ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. తమను మహిళా పోలీసులుగా కొనసాగించాలని, వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కొందరు మహిళా కార్యదర్శులు వేసిన అనుబంధ పిటిషన్లను అనుమతించింది. విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications