టీవీ చానళ్ల బ్యాన్‌పై హైకోర్టు, ఏం చేశారని టి ప్రభుత్వానికి
హైదరాబాద్: ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి తెలుగు ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్ పైన కౌంటర్ సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్స్ అసోసియేషన్ (ఎంఎస్ఓ)ను హైకోర్టు బుధవారం ఆదేశించింది.
ఏ కారణాల వల్ల నిలిపివేశారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఎంఎస్‌వోలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ ఆదేశించారు. అలాగే ప్రసారాల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలపై తెలంగాణ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించారు.

ఏబీఎన్ ప్రసారాలకు ఎటువంటి అంతరాయం కలిగించకుండా తెలంగాణలోని పది జిల్లాల్లో పునరుద్ధరించాలని కోరుతూ చానెల్ అసోసియేట్ ఎడిటర్ మూర్తి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రసారాలు నిలిపివేసి నాలుగు వారాలు కావస్తోందని, ఇంకా జాప్యం చేస్తే చానెల్ నష్టపోతుందని, వార్తాప్రసారాలు నిలిపి వేయడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడమే అవుతుందని, ఈ అంశంలో కోర్టు కలుగజేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని ఏబీఎన్ తరఫు న్యాయ వాది పోసాని వెంకటేశ్వర్లు కోరారు.
పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేశారా? అని ఎంఎస్‌వోల తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. లేదని బదులిచ్చిన ఎంఎస్‌వోల తరఫు న్యాయవాది.. కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు కోరారు. దీంతో ఏ కారణాల వల్ల చానెళ్ల ప్రసారాలు నిలిపివేశారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications