YS Viveka Case: అవినాష్ బెయిల్ పిటీషన్ విచారణలో మరో మలుపు..!!
కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పైన హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలనే అభ్యర్ధనను సుప్రీం తోసిపుచ్చింది. ఈ క్రమంలో హైకోర్టులో అవినాష్ బెయిల్ పిటీషన్ పైన విచారణ..నిర్ణయానికి అనుగుణంగా సీబీఐ అడుగులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో ఈ రోజు హైకోర్టులో జరగాల్సిన అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ రేపటికి వాయిదా పడింది.
విచారణ వాయిదా
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పైన గురువారం విచారణ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఇదే కోర్టు గత వారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో, తిరిగి హైకోర్టు లో విచారణ జరగాల్సి ఉంది. మంగళవారం విచారణ జరగాల్సి ఉన్నా, సుప్రీంకోర్టు ఆదేశాలు అందకపోవటంతో ఈ రోజు విచారించాలని కోర్టు నిర్ణయించింది.

దీని పైన ఈ రోజు కోర్టులో అవినాష్ తరపు న్యాయవాది రేపు విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అదే సమయంలో సునీత తరపు న్యాయవాది ఎల్లుండి తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్దించారు. దీంతో, గురువారం మధ్నాహ్నం 3.30 గంటల కు అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
వాదనలు వినాలంటూ సునీత
ఈరోజు జాబితాలో లేని పిటిషన్లపై విచారణ చేపట్టమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం పులివెందులలో ఉన్నారు. ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. వివేకా హత్య కేసులో తన పైన కుట్ర చేస్తున్నారని అవినాష్ ఆరోపిస్తున్నారు. వైఎస్ సునీత గతంలో ఒక విధంగా, ఇప్పుడు మరో విధంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.

ఈ ఘటనతో తనకు, తన తండ్రికి ఎటువంటి సంబంధం లేదన్నారు. హత్య జరిగిన రోజున లేఖ అంశాన్ని అవినాష్ ప్రస్తావిస్తున్నారు. సీబీఐ తాజాగా సునీతతో పాటుగా రాజశేఖర్ రెడ్డిని విచారించింది. అవినాష్ చేసిన ఆరోపణల పైనే ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇటు అవినాష్ కేసులో సుప్రీంను ఆశ్రయించిన సునీత, ఇప్పుడు హైకోర్టును తమ వాదనలు వినాలని పిటీషన్ దాఖలు చేసారు.
సీబీఐ ఏం చేయబోతోంది
హైకోర్టు అవినాష్ ను 25వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దంటూ సీబీఐకి సూచించింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాష్ కు స్పష్టం చేసింది. సీబీఐకి హైకోర్టు నిర్దేశించిన గడువు ముగిసింది. అటు సుప్రీం కోర్టు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వటానికి నిరాకరించింది. సీబీఐ అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేదని, సంయమనం పాటిస్తోందని సుప్రీం వ్యాఖ్యానించింది. అటు అరెస్ట్ పైన స్పందించిన అవినాష్ దైవాధీనం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, ఇప్పుడు సీబీఐ నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications