"ఇప్పటం" వ్యవహారంలో కొత్త మలుపు - హైకోర్టు కీలక ఆదేశాలు : పవన్ పర్యటన వేళ...!!
ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన ఇప్పటం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటంలో రోడ్ల విస్తరణ కోసం స్థానిక మున్సిపల్ అధికారులు ఆక్రమణల కూల్చి వేత ప్రారంభించారు. అయితే, జనసేన సభకు స్థలాలు ఇచ్చిన వారిని లక్ష్యంగా చేసుకొని వారి ఇళ్లను ప్రభుత్వం కూల్చి వేసిందంటూ జనసేనాని ఆరోపించారు. వారికి మద్దతుగా ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇళ్లు కూల్చివేస్తుందా అంటూ నిలదీసారు. ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇప్పటం వివాదంలో కొత్త మలుపు
ఈ ఇళ్ల కూల్చివేతతోనే ప్రభుత్వ పతనం ప్రారంభమైందంటూ నినిదించారు. ఇదే సమయంలో ప్రభుత్వం..అధికారులు ఈ వ్యవహారం పైన స్పష్టత ఇచ్చారు. గత ఏప్రిల్ లోనే ఆక్రమణల పైన నోటీసులు ఇచ్చామని..ప్రహరీలు మినహా నివాసాలు ఎక్కడా కూల్చలేదని వివరించారు. కూల్చివేతలు కొనసాగుతున్న సమయంలోనే ఇళ్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అప్పట్లో స్టే ఇచ్చింది. ఈ కేసు తాజాగా విచారణ సమయంలో పిటీషనర్లకు ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని చెప్పిన అంశాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. తమకు నోటీసులు ఇచ్చారని పిటీషనర్లు కోర్టు ముందు అంగీకరించారు. దీంతో, న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

పిటీషనర్లపై హైకోర్టు ఆగ్రహం -జరిమానా
వాస్తవాలను కప్పి పుచ్చి.. కోర్టును తప్పుదోవ పట్టిస్తారా అంటూ న్యాయస్థానం మందలించింది. ఇక, దీనికి సంబంధించి ఈ రోజు ( గురువారం) హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మందికి 14 లక్షలు జరిమానా విధించింది. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయించినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఇళ్ల కూల్చివేత పైన దాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం కొట్టి వేసింది. అయితే, ఇప్పటికే ఇప్పటం లో ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష చొప్పున జనసేన అధినేత ఆర్దిక సాయం ప్రకటించారు.

పవన్ కల్యాణ్ పర్యటన వేళ అనూహ్యంగా
ఈ నెల 27న మరోసారి ఇప్పటం లో పర్యటించి వారికి ఆర్దిక సాయం అందించే విధంగా కార్యక్రమం ఖరారైంది. ఇదే సమయంలో హైకోర్టు ఈ కేసు విచారణకు రావటం.. పిటీషనర్లపై హైకోర్టు సీరియస్ అవ్వటంతో ..ఇప్పుడు పవన్ పర్యటన కొనసాగుతుందా.. లేక పార్టీ నేతల ద్వారా వారికి ఆర్దిక సాయం అందిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం పైన రాజకీయంగా ప్రతిపక్షాలు టార్గెట్ చేసిన ఈ విషయంలో..ఇప్పుడు హైకోర్టు పిటీషన్ కొట్టేయటంతో ప్రభుత్వానికి రిలీఫ్ దొరికింది.












Click it and Unblock the Notifications