ఏపీ ఉద్యోగులకు ఊరట-ఐఆర్ రికవరీని సీరియస్ గా తీసుకుంటామని హైకోర్టు హెచ్చరిక
ఏపీలో ఉద్యోగులకు తాజాగా ప్రకటించిన పీఆర్సీ జీవోల వ్యవహారం ఇంకా తేలడం లేదు. తాజా పీఆర్సీ అమలు నేపథ్యంలో ఉద్యోగులకు గతంలో ఇచ్చిన మధ్యంతర భృతిని వారి జీతాల నుంచి కోత పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇవాళ హైకోర్టులో మరోసారి ప్రస్తావనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేసింది.
పీఆర్సీ వివాదంపై ఉద్యోగసంఘాలతో జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వం తాజాగా జీవోల్ని విడుదల చేసింది. అయితే ఇందులో గతంలో ఇచ్చిన మధ్యంతర భృతి రికవరీ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఎలాంటి ఉత్తర్వులూ వెలువడలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. అసలే ఆర్ధిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం.. ఏ క్షణాన దీన్ని తమ జీతాల్లో నుంచి కోత పెడుతుందో అన్న భయాలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. అయితే గతంలో ఉద్యోగుల జీతాల నుంచి మధ్యంతర భృతి రికవరీ చేయడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీటిని మరోసారి కొనసాగిస్తున్నట్లు హైకోర్టు ఇవాళ ప్రకటించింది.

Recommended Video
తమ ఆదేశాలకు విరుద్ధంగా ఉద్యోగుల జీతాల్లో నుంచి ఐఆర్ ను రికవరీ చేస్తే సీరియస్ గా తీసుకుంటామని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో ఐఆర్ రికవరీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఎలాంటి ఉత్తర్వులూ వెలువడకపోవడంపై హైకోర్టులో పిటిషనర్లు క్లారిటీ కోరారు. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు.. తమ ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని, వీటిని ఉల్లంఘించి ఐఆర్ రికవరీకి ప్రయత్నిస్తే సీరియస్ గా పరిగణిస్తామని పిటిషనర్లకు భరోసా ఇచ్చింది. దీంతో ఐఆర్ రికవరీ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేని పరిస్ధితి నెలకొంది.












Click it and Unblock the Notifications