తిరుమలలో లగేజీ మేనేజ్మెంట్ ఇలా: అరకోటికి పైగా డెలివరీలు
కలియుగ వైకుంఠం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలకమైన ఉచిత లగేజీ, సెల్ ఫోన్ డిపాజిట్ సేవలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోంది. భక్తుల రద్దీ నానాటికీ పెరుగుతున్న తరుణంలో, వారి సామాన్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అత్యాధునిక సాంకేతికతతో టీటీడీ ఈ సేవలను అందిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 51.38 లక్షల మంది శ్రీవారి భక్తులు తమ లగేజీని భద్రపరుచుకోవడానికి ఈ ఉచిత సేవల కౌంటర్లను ఉపయోగించుకున్నారు. మెరుగైన సేవల కోసం తిరుమలతో పాటు కాలినడక మార్గాల్లో కలిపి మొత్తం 66 కౌంటర్లను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. సుమారు 345 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా విధి నిర్వహణలో పాల్గొంటూ భక్తులకు అండగా నిలుస్తున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కౌంటర్లను ఆశ్రయించే వారి సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. కేవలం గడచిన మూడు రోజుల్లోనే తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో 3.41 లక్షల మంది స్వామివారి భక్తులు తమ సామాన్లను భద్రపరుచుకుని క్షేమంగా దర్శనానికి వెళ్ళడం విశేషం.
కాలినడక భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్లు
అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల ద్వారా కొండపైకి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలను నిర్వహిస్తోంది. నడక దారిలో లగేజీ భారం లేకుండా భక్తులు తమ సామాన్లను కింద డిపాజిట్ చేసి, తిరుమలకు చేరుకున్నాక సులభంగా తిరిగి పొందవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా లక్షలాది మంది సామాన్య భక్తులకు కాలినడక ప్రయాణం సులభతరమవుతోంది.
అలిపిరి కాలినడక మార్గం వద్ద ఉన్న అయిదు కౌంటర్లలల్లో- 10,194 బ్యాగులు, శ్రీవారి మెట్టు మార్గం వద్ద రెండు కౌంటర్లల్లో 3,025, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు కౌంటర్లల్లో 4,270 సెల్ ఫోన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద గల అయిదు కౌంటర్లల్లో 11,941 ఫోన్లు, ఇతర 6,749 లగేజీలను భద్రపర్చుకోవచ్చు. లగేజీ డిపాజిట్, డెలివరీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు టీటీడీ సరికొత్త సాంకేతిక విధానాన్ని అమలు చేస్తోంది.
భక్తులు తమ లగేజీని కౌంటర్లలో అప్పగించే సమయంలో సిబ్బంది 'ఫేస్ రికగ్నిషన్' సాంకేతికతతో క్యూఆర్ కోడ్ రూపొందించి బ్యాగుపై స్టిక్కర్ వేస్తారు. అనంతరం భక్తుడికి కంప్యూటరైజ్డ్ రశీదును ఇస్తారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమలలోని డెలివరీ కౌంటర్లలో దీన్ని చూపించగానే కేవలం ఒక్క నిమిషంలోనే భక్తులకు వారి సామాన్లను చేతికందిస్తున్నారు.
శ్రీవారి భక్తులు తిరుమల కొండపై నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోకుండా, టీటీడీ అధికారికంగా ఏర్పాటు చేసిన ఉచిత లగేజీ కౌంటర్ల సేవలను మాత్రమే ఉపయోగించాలని అధికారులు కోరారు. కల్యాణకట్ట, సుపథం, పీఏసీ-4 వంటి ప్రధాన ప్రాంతాల్లో డిపాజిట్ చేసిన విడిభాగాలను కూడా అంతే భద్రంగా కాపాడుతున్నారు. కొండపై లగేజీ సేవలు పూర్తిగా ఉచితమని, ఎక్కడా ఎవరికీ ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని టీటీడీ భక్తులకు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications