నేడు హై పవర్ కమిటీ భేటీ రద్దు ... రీజన్ ఇదేనా ?
ఏపీ రాజధాని విషయంలో ఏపీలో ఒకపక్క ఆందోళనలు కొనసాగుతుంటే మరోపక్క రాజధాని విషయంలో వేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ సిఫార్సులను అధ్యయనం చెయ్యటానికి వేసిన హై పవర్ కమిటీ నిన్న భేటీ అయ్యి పలు సూచనలు చేసిన వేళ నేడు క్యాబినెట్ భేటీ నిర్వహించాలని భావించారు. కానీ ఊహించని ట్విస్ట్ లతో క్యాబినెట్ భేటీ మరోమారు సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మరోసారి హైపవర్ కమిటీ భేటీ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ మీటింగ్ లేనట్లు తాజా పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది.
Recommended Video

రాజధాని రైతుల అభ్యంతరాల గడువును పెంచిన హైకోర్టు
ఇప్పటికే రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాలను కూడా తెలుసుకుని వారికి న్యాయం జరిగేలా నివేదిక రూపొందిస్తామని చెప్పిన హైపవర్ కమిటీ రైతుల అభిప్రాయాలు తీసుకోకముందే నివేదిక ఇస్తుంది అన్న భావన రాజధాని ప్రాంత రైతుల్లో కలుగుతుంది . ఇక సీఆర్డీఏకు తమ అభిప్రాయాలు తెలిపేందుకు గడువు పెంచాలని రాష్ట్ర హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చెయ్యగా ఈ పిటిషన్ పై టీడీపీ ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ వాదనలు వినిపించారు. రైతులు తమ అభ్యంతరాలను చెప్పుకునేందుకు తగిన సమయం ఇవ్వలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఇందుకోసం గడువును పెంచాలని కోర్టును కోరారు.

20 వ తేదీ మధ్యాహ్నం వరకు అభ్యంతరాల స్వీకరణ గడువు
ఇక దీనిపై స్పందించిన కోర్టు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలవరకు గడువును పెంచుతూ ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. రైతులు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి వ్యక్తిగతంగా, లిఖితపూర్వంగా, సీఆర్డీఏ వెబ్ సైట్, ఈ మెయిల్ ద్వారా అభ్యంతరాలు తెలపవచ్చని కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నేడు మధ్యాహ్నం 3గంటలకు జరపాలని నిర్ణయించి తాజాగా కోర్టు ఆదేశాల నేపధ్యంలో మరోమారు మార్చినట్టు తెలుస్తుంది.

20వ తేదీనే హైపవర్ కమిటీ నివేదిక
ఇక హై పవర్ కమిటీ గతంలో ఒకసారి సీఎంతో చర్చించింది . ఇక తమ ఫైనల్ రిపోర్టును రెండు రోజుల్లో అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 20న రాజధాని రైతుల అభ్యంతరాలు మధ్యాహ్నం వరకు తీసుకోనున్నారు. ఇక అదే రోజు హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇక ఆ రోజే ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ సమావేశంలో రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకుని దానిపై ఆమోదముద్ర వేసి.. అదే రోజు శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజధాని రైతులకు న్యాయం చెయ్యాలనే ఆలోచనలో జగన్ సర్కార్
అంతేకాదు ఇప్పటికే రాజధాని రైతులు 32 రోజులుగా పోరాటం సాగిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం రాజధాని రైతులకు గత ప్రభుత్వం కంటే మెరుగైన బెనిఫిట్స్‌ను ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాజధాని రైతులకు సాధ్యమైనంత వరకు నష్టం జరగకుండా ఉండేలా ఆలోచన చేస్తున్న సర్కార్ రాజధాని రైతుల అభ్యంతరాలు పరిశీలించాకే హైపవర్ కమిటీ తుది నివేదిక ఇస్తే ఎలాంటి వివాదం లేకుండా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం .












Click it and Unblock the Notifications