భానుడి భగభగలకు ఏపీ వాసులు విలవిల.. మళ్లీ రికార్డులు బ్రేక్ ఖాయమా
ఏపీలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజలు బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. ఫిబ్రవరిలోనే ఈ రేంజ్ లో ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే గత ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా సేమ్ సీన్ రిపీట్ కానుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
ఇక ఇప్పటికే చలి తీవ్రత కూడా తగ్గుతున్న తరుణంలో.. ఈ నెల రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరగనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు నమోదైన ఉష్ణోగ్రతలను వాతావరణ శాఖ ప్రకటించింది. కర్నూలు, కాకినాడ, మచిలీపట్నం, తుని సహా పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలుస్తోంది. 3 నుంచి 6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగాయని అధికారులు వెల్లడించారు. అలానే రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీలు.. రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.

అయితే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి సముద్రాలు కలుషితం కావడం ఒక కారణమని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సముద్రాలు 30 శాతం కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి. కానీ సముద్రాలు కూడా కలుషితం కావడంతో.. ఆ ఎఫెక్ట్ గ్రీన్ హౌస్ వాయువులపై పడుతుందని చెబుతున్నారు. వీటి కారణంగానే ప్రతి ఏటా రికార్డు స్థాయిలో వేడి పెరుగుతోందన్నారు. అంతే కాకుండా బొగ్గు ఆధారిత విద్యుత్తు వినియోగం పెరగడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.
మరోవైపు వేడితో ముప్పు తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 2015-2024 అత్యంత వేడి దశాబ్దంగా నిలవగా.. 2010-2024 మధ్య పదేళ్లు వేడి సంవత్సరాలుగా రికార్డు సృష్టించాయి. గత గణాంకాలను గమనిస్తే సగటున 0.31 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే మరణాల శాతం 0.2 శాతం నుంచి 5.5 శాతం పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తరహాలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మార్చి నెలాఖరు నుంచే వడగాలులు వీచే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications