నేడు ఏపీలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక..
నేడు ఏపీలోని పలు జిల్లాలకు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈఏడాది మార్చినెల మొదటినుంచి రెండుతెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంటున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం వీపరీతమైన వేడి వాతావరణం కొనసాగింది. శనివారం నాడు రాయలసీమ, ఉత్తరకోస్తాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. ఇక, ఆదివారం నేడు రాయలసీమలోని నంద్యాల జిల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రాగల రెండు రోజుల్లో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
శనివారం నాడు నంద్యాల జిల్లా అవుకులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. నేడు రాయలసీమ, ఉత్తరకోస్తాలోని పలు ప్రాంతాల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఆదివారం నాడు ఉత్తరకోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, వైయస్‌ఆర్ కడప జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక, సోమవారం నాడు ఒక మండలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. మరో 64 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నిన్న (శనివారం) విజయనగరం, అనకాపల్లి, నంద్యాల, వైయస్‌ఆర్ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. మరో 52 మండలాల్లో ఓ మాదిరి వడగాలులు వీచాయి అని అధికారులు వివరించారు. కాబట్టి ప్రజలు అత్యవసర సమయాల్లో తప్ప బయటికివ వెళ్లొద్దని సూచించింది. బయటికి వెళ్లేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

43 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు..
ఆది, సోమవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, వైఎస్ఆర్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకుపైనే నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండాలని సూచించింది. ఎండవేడిమి కారణంగా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.












Click it and Unblock the Notifications