తిరుపతిలో గోశాల వద్ద హై టెన్షన్.. భూమన వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ వి గోశాలలో 100 గోవులు మృతి చెందాయని వైసిపి నేత, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం ఏపీ రాజకీయాల్లో రచ్చకు కారణం అయింది. ఏపీలో అధికార ప్రతిపక్షాల పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
భూమనకు టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్
తాజాగా టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని , కలికిరి మురళీమోహన్, నవాజ్ బాషాలు ఫోన్ చేసి ఎస్వీ గోశాలను సందర్శించాలని భూమన కరుణాకర్ రెడ్డిని కోరారు. తాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్పీతో సమన్వయం చేసుకుంటామని, ఆయన సందర్శనకు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చారు.

గోశాల వద్ద భారీగా పోలీసులు
అసత్య ఆరోపణలు చేయకుండా క్షేత్రస్థాయికి రావాలని పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని సూచించారు. ఇక ఎమ్మెల్యేలు కాల్ చేసి పిలవడంతో తాను గోశాలకు వస్తానని, వైసిపి నేత మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలను సందర్శించడానికి బయలుదేరారు.దీంతో తిరుపతి గోశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
భూమనకు గోశాల వెళ్లేందుకు పోలీసుల అనుమతి
ఇదిలా ఉంటే అంతకుముందు పోలీసులు అనుమతి ఇస్తేనే గోశాలకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొనడంతో గోశాలకు వెళ్లడానికి తాము భూమన కరుణాకర్ రెడ్డికి ఎటువంటి అభ్యంతరం పెట్టలేదని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. భూమన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో గోశాల సందర్శనకు వెళ్లవచ్చని తాము సూచించినట్టు పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ని ఎటువంటి గృహనిర్బంధం చేయలేదని, తాము ఎక్కడ అడ్డుకోలేదని ఆయన తెలిపారు.
కండీషన్ పెట్టిన జిల్లా ఎస్పీ.. తిరుపతిలో టెన్షన్
అయితే రెండు పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకూడదని సూచించామని, ఒకవేళ అలా వెళితే ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఈ విధమైన సూచనలు చేశామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో ప్రస్తుతం ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ ఎవరూ తగ్గకపోవటంతో, అలాగే వీరి సవాళ్ళకు పోలీసులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications