రణరంగంగా కాకినాడ : వైసీపీ Vs జనసేన.. రాళ్ల దాడి, ఉద్రిక్తతలు..
కాకినాడ రాజకీయ రణరంగంగా మారింది. జనసేన,వైసీపీ నేతలు ఘర్షణకు దిగడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తమ అధినేత పవన్ కల్యాణ్‌పై
అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరారు. జనసేన కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు భానుగుడి సెంటర్ వద్ద అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్ల దాడికి పాల్పడ్డారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు కొంతమంది జనసేన మహిళా కార్యకర్తలు గుడిలో దాక్కున్నట్టు తెలుస్తోంది. రోడ్లపై ఇరు పార్టీల నేతలు బాహాబాహికి దిగడంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
కాగా,మంత్రి పదవి కోసమే ఎమ్మెల్యే ద్వారంపూడి తమ నాయకుడిపై ఆరోపణలు చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అమరావతి రైతుల కోసం ఢిల్లీ వెళ్తే.. ప్యాకేజీ స్టార్ అంటూ ఎలా విమర్శిస్తారని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశానికి తొత్తుగా పనిచేస్తున్నారని పదేపదే ఆరోపించడంలో అర్థం లేదన్నారు. తమ నాయకుడు పవన్ కల్యాణ్ ఎవరికీ అమ్ముడు పోలేదని, అమరావతి రైతుల కోసం చిత్తశుద్దితో పోరాడుతున్నాడని చెప్పారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ద్వారంపూడి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు తానెవరికీ క్షమాపణలుు చెప్పేది లేదని ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నోసార్లు సీఎం జగన్‌ను ఉన్మాది, తుగ్లక్ అని విమర్శించారని.. అలాంటప్పుడు తాను
విమర్శలు చేయడంలో తప్పేముందని అన్నారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమాతో జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టించారని అన్నారు. నిన్నటికి నిన్న తిరుపతి ర్యాలీలోనూ జగన్‌ను చంద్రబాబు ఉన్మాది అన్నారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అవసరమైనప్పుడు బయటకొస్తాడని, తాను ఏదైనా స్ట్రైట్ ఫార్వార్డ్‌గానే తేల్చుకుంటానని అన్నారు. మంత్రి పదవి కోసమే పవన్ కల్యాణ్,చంద్రబాబులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలను ఆయన ఖండించారు. తనకెలాంటి మంత్రి పదవులు అవసరం లేదని, తాను జక్కంపూడి రామారావు శిశ్యుడిని అని.. ఆయన తరహాలోనే రాజకీయాలు చేస్తానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications