పరిటాల సవాల్...! తోపుదుర్తి ప్రతి సవాల్...! క్షణక్షణం వేడెక్కుతున్న రాజకీయం!!
ఆ నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రత్యర్థుల సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మధ్య ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంటోంది. వారేమీ సామాన్యమైన ప్రత్యర్థులు కారు. ఒకరికొకరు ఢీ అంటే ఢీ అంటున్నారు. కంచుకోటను కాపాడుకోవడానికి ఒకరు.. దాన్ని కంచుకోటగా మలచుకోవడానికి మరొకరు హోరాహోరీగా తలపడుతుండటంతో అక్కడి వాతావరణంలో రాజకీయ మేఘాలు కమ్ముకున్నాయి.

దూకుడు రాజకీయం చేస్తున్న తుపుదుర్తి
పరిటాల కుటుంబానికి కంచుకోట లాంటి రాప్తాడు నుంచి 2019లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. పరిటాల రవీంద్ర వారసుడైన శ్రీరామ్ పై గెలుపు దక్కడంతో అక్కడ వైసీపీ పునాదులను పటిష్టపరచాలనే ఏకైక లక్ష్యంతో ప్రకాష్‌రెడ్డి పనిచేస్తున్నారు. తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గెలుపు సాధించినప్పటినుంచి నియోజకవర్గంలో ఆయన దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. పరిటాల కుటుంబాన్ని తట్టుకోవాలంటే ఆ మాత్రం దూకుడు ఉండాలని ఆయన అనుచరులు చెబుతున్నారు.

నలిగిపోతున్న అధికార యంత్రాగం
అధికార యంత్రాంగం పరిస్థితి కూడా కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అనే రీతిలో నలిగిపోతోంది. ఒకరకంగా ఇక్కడి యంత్రాగం పరిటాల వర్గంవైపు, ప్రకాష్ రెడ్డి వర్గంవైపు రెండుగా చీలిపోయిందనే అంచనాలున్నాయి. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు బావుటా ఎగరవేయాలనే పట్టుదలతో శ్రీరామ్, అతని తల్లి సునీత పనిచేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం కలియదిరుగుతున్నారు.

ఎవరిని టచ్ చేసినా వదిలేది లేదు??
తమ అనుచరులు ఎవరినైనా టచ్ చేసినా వదిలే ప్రసక్తే లేదని పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు దమ్ముంటే గన్‌మెన్లను తీసి రావాలంటూ ప్రకాష్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. తనపై ఎవరు పోటీచేస్తారో తేల్చుకోవాలని సవాల్ విసురుతున్నారు. రాప్తాడుతోపాటు ధర్మవరంలో కూడా పరిటాల కుటుంబం పునాదులు బలంగా ఉన్నాయి. దీంతో రాబోయే ఎన్నిల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి, పరిటాల సునీత రాప్తాడు నుంచి పోటీచేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం స్పష్టత ఇవ్వలేదు. కానీ ధర్మవరంలో శ్రీరామ్ పనిచేసుకుంటూ వెళుతున్నారు. రాప్తాడు నుంచి ఇద్దరిలో ఎవరు పోటీచేస్తారనే విషయాన్ని బహిర్గతం కానివ్వకుండా ప్రత్యర్థిని అయోమయంలోకి నెట్టేయాలనే వ్యూహంతో పరిటాల కుటుంబం ఉంది. ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో తెలియాలంటే కొంతకాలం వేచిచూడక తప్పేలా లేదు.!!












Click it and Unblock the Notifications