ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవులు
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలహీనపడింది. అతి తీవ్ర తుఫాన్ స్థాయి నుంచి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ఉదయానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ- దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తోన్నాయి. దీని తీవ్రత బుధవారం వరకు కొనసాగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ వేకుల జామున 2.1 నిమిషాల సమయం నాటికి ఈ తుఫాన్.. చెన్నైకి ఆగ్నేయంగా 90, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయ దిశలో 90, కడలూరుకు తూర్పు-ఈశాన్య దిశలో 110, కారైకల్ కు ఈశాన్య దిశలో 180 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంక తీరం, దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించిన తర్వాత ఇది బలహీనపడింది.

దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీలో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి- రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు, కడప, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశించారు.
నెల్లూరులో నేడు జరగాల్సిన పీజీఆర్ఎస్ కూడా రద్దు చేశారు. దీంతో పాటు జిల్లాలోని అన్ని జూనియర్ కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సెలవు ప్రకటించాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications