ఏపీలో తుఫాను తీవ్రత, బయటకు రావద్దు - ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..!!
ఏపీ వైపు తుఫాను దిత్వా దూసుకొస్తోంది. తుఫాను తీవ్రత పైన వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇటు ప్రభుత్వం సైతం అప్రమత్తం అయింది. అధికార యంత్రాంగానికి కీలక దిశా నిర్దేశం చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ సమయంలో అత్యవసరం అయితే మినహా ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉంది. దీంతో, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దిత్వా తుఫాను పై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రి వంగలపూడి అనిత తుఫాను పై సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు.

దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
అదే విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌లను 24/7 కొనసాగించాలని ఆదేశించారు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
శనివారం నుంచి సోమవారం వరకూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం రోజున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో సైతం భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications