ఇంకా వాళ్ళలో వైసీపీ రక్తమే.. విశాఖలో గంజాయి లేకుండా చేస్తాం: హోంమంత్రి వంగలపూడి అనిత
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత పోలీస్ యంత్రాంగాన్ని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఆలయాల సందర్శన చేపట్టిన వంగలపూడి అనిత, నేడు సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వేద మంత్రోచ్ఛారణల నడుమ వంగలపూడి అనితకు స్వాగతం పలికారు. స్వామివారికి అనిత ప్రత్యేక పూజలు చేశారు.
పోలీసులపై హోం మంత్రి అనిత తీవ్ర వ్యాఖ్యలు
ఈరోజు సింహాచలం అప్పన్నను దర్శించుకున్న క్రమంలో వంగలపూడి అనిత మరో మారు కొంతమంది పోలీస్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే సింహాచలం అప్పన్న దేవస్థానం భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతానని, ఒక్క గజం కూడా ఎవరు కబ్జా చేయకుండా చూసుకుంటానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. పంచ గ్రామాల భూ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని హోం శాఖ మంత్రి అనిత వెల్లడించారు.

కొందరు పోలీసుల్లో ఇంకా వైసీపీ రక్తమే ఉంది
కొంతమంది పోలీస్ అధికారులలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తమే ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. వారు తమ వ్యవహార శైలి మార్చుకోవాలని వంగలపూడి అనిత సూచించారు. అయినా వైసీపీపై ప్రేమ పోకపోతే ఉద్యోగాన్ని వదిలేసి ఆ పార్టీ కోసం పని చేసుకోవచ్చునని ఆమె సూచించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు.
గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు టోల్ ఫ్రీ నంబర్
మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కట్టడికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని హోమ్ మంత్రి పేర్కొన్నారు. గంజాయికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు ఇస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వారం రోజుల్లో టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని.. ఆ నంబర్‌కు ఫోన్ చేసి గంజాయిపై సమాచారం ఇవ్వొచ్చని ఆమె తెలిపారు.
విశాఖలో మూడు నెలల్లో గంజాయి లేకుండా చేస్తాం
సమాచారం ఇచ్చిన వారి వివరాలను బహిర్గతం చేయబోమని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖను గంజాయికి రాజధానిని చేశారని, 3 నెలల్లో అక్కడ గంజాయి లేకుండా చేస్తామని చెప్పారు హోమ్ మంత్రి వంగలపూడి అనిత.












Click it and Unblock the Notifications