సీఎం జగన్ కు కేంద్రం అండగా - తిరుపతి మీటింగ్ తరువాత మార్పు : అడిగిన వెంటనే ఆమోదం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో కేంద్రంలో మార్పు వచ్చిందా. ఇప్పటి వరకు ఏది అడిగినా చూద్దాం..చేద్దాం అని చెప్పటం మినహా కేంద్రం నుంచి ఏపీ సీఎం జగన్ ఆశించిన స్థాయిలో ఏ రకంగానూ మద్దతు లభించ లేదు. కానీ, ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాని మోదీ పైన చేసిన వ్యాఖ్యలతో వారిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో జగన్ గెలిచి ఢిల్లీ వెళ్లిన తరువాత ప్రధాని నాడు జగన్ ను అభినందించారు. ఇక, కేంద్రంతోనూ జగన్ సత్సంబంధాలు కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన ప్రతీ సందర్భంలోనూ..బిల్లుల విషయంలోనూ వైసీపీ మద్దతిస్తూ వచ్చింది.

కేంద్ర వైఖరిలో మార్పు
ఇక, కరోనా చర్యల సమయంలోనూ జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలపైన సైతం జగన్ కేంద్రానికి మద్దతుగా నిలుస్తూ చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. కానీ, పోలవరం నిధులు .. రుణ పరపతి పెంపు ..స్టీల్ ప్లాంట్ వంటి విషయాల్లో మాత్రం కేంద్రం నుంచి సానుకూల స్పందన కనిపించ లేదు. ఇక, సొంత పార్టీ ఎంపీ రఘురామ రాజు పైన ఫిర్యాదు చేసి..అనర్హత వేటు వేయాలని కోరినా...చర్యలు తీసుకోకపోవటం మాత్రం వైసీపీకి రుచించటం లేదు. ఇదే అంశం పైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు పలు మార్లు స్పీకర్ ను కలిసి ఫిర్యాదులు..లేఖలు అందించారు.

వైసీపీకి ఆ విషయంలో సందేహం
దీంతో..గత పార్లమెంట్ సమావేశాల్లో అప్పటి వరకు కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క సారి కూడా నిరసన చేయని వైసీపీ ఎంపీలు...ఒక్క సారిగా పోడియం ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదా పైన నినాదాలు చేసారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ పట్టుబట్టారు. ఇక, తాజాగా టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు..టీడీపీ కార్యాలయం పైన దాడితో చంద్రబాబు నేరుగా అమిత్ షా కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు. కొద్ది రోజుల క్రితం సదరన్ రీజనల్ సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన అమిత్ షా తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఆయనతో మంతనాలు సాగించారు.

జగన్ డిమాండ్లపై సానుకూలంగా షా
ఇక, సమావేశంలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా అనేక అంశాలను ప్రస్తావించారు. వాటి పైన అమిత్ షా సైతం సానుకూలంగా స్పందించటం తో సీఎం జగన్ పట్ల ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. ఇక, ఈ నెల 24న ఏపీలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని వివరిస్తూ.. ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రధానితో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖలు రాసారు. వెంటనే నష్టం అంచనాకు కేంద్రం అధికారులను పంపాలని కోరారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మంజూరు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

జగన్ లేఖ రాసిన వెంటనే స్పందన
ఇక, ఆ లేఖ రాసిన మరుసటి రోజునే కేంద్ర హోం శాఖ ఏపీకి వరద సాయం అంచనా కోసం అధికారులను తక్షణం పంపుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏ వరదలు..వర్షాలు..నష్టాల సమయంలో ఇంత త్వరగా స్పందించిన దాఖలాలు లేవు. కేంద్రం పంపిన అధికారులు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది. అదే విధంగా సీఎం జగన్ కోరిన విధంగా రుణ పరిమితి పెంపు అంశంలోనూ కసరత్తు జరుగుతున్నట్లు ఏపీ అధికారులకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది.
Recommended Video

భవిష్యత్ రాజకీయాలకు సంకేతం
దీంతో..ఇప్పటికే మిత్రులంతా దూరం అవుతున్న ఈ సమయంలో కేంద్ర పెద్దల వైఖరిలో జగన్ పట్ల మార్పు స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ వైసీపీ నేతల్లో మొదలైంది. త్వరలో రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అందులో వైసీపీ మద్దతు అవసరం కానుంది. దీంతో...ఇప్పుడు కేంద్రం నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో .. ఇప్పుడు వైసీపీ నేతలు పెండింగ్ అంశాలను సైతం పరిష్కరించాలని ఈ పార్లమెంట్ సమావేశాల వేదికగా కేంద్రం పైన ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. బీజేపీకి ఎలాగైనా దగ్గరవ్వాలనే చంద్రబాబు ప్రయత్నాలకు కౌంటర్ గా ఈ పరిణామాలను వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications