వైసీపీలో చేరాక కేశినేని నాని పరిస్ధితి ఏంటి ? చంద్రబాబు నుంచి అవినాష్ వరకూ !
రాజకీయాల్లో పరిస్దితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయనే సామెత వింటూనే ఉంటాం. అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలో ఈ సామెతను కొంచెం మార్చుకోవాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. ఎందుకంటే సొంత సామాజిక వర్గ పార్టీగా ప్రచారంతో గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీని వీడి తాజాగా ఆయన ప్రత్యర్ధి పార్టీ వైసీపీలోకి ఫిరాయించారు. దీనికి ఆయన చెప్పుకున్న కారణం తనకు సరైన ట్రీట్ మెంట్ లేదని మాత్రమే.
కానీ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలకూ, ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న పరిస్ధితులకూ అస్సలు పొంతన లేకుండా పోతోంది. ముఖ్యంగా వైసీపీలోకి తన ఫిరాయింపుతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుందని నాని చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుని ఇప్పుడు టీడీపీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు. దీనికి కారణం నానితో పాటు వైసీపీలోకి వెళ్లిన నల్లగట్ల స్వామిదాస్ కు తనతో పాటు టికెట్ ఇప్పించుకోవడం మినహా ఆయన సాధించిందేమీ లేకపోవడమే.

గతంలో నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు బ్రదర్స్ తో పాటు పలువురు వైసీపీ నేతలతో కేశినేని టీడీపీలో ఉంటూనే సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడూ వారు కేశినేని వెంట కనిపిస్తున్నారు. అయితే వారిని కలవాలన్నా కేశినేని విజయవాడలో కాకుండా నందిగామ వెళ్లి కలవాల్సిన పరిస్దితి. అలాగే విజయవాడలో పరిస్దితి అయితే మరీ ఘోరంగా ఉంది. ఇప్పటివరకూ ఎన్నికల్లో బోణీ కొట్టని జూనియర్ నేత దేవినేని అవినాష్ తో కలిసి నియోజకవర్గాల్లో పర్యటించాల్సిన పరిస్దితి.

దీంతో ఒకప్పుడు చంద్రబాబుతో నేరుగా చర్చలు జరిపే స్ధాయిలో ఉన్న కేశినేని నానికి ఇప్పుడు వైసీపీలో చేరాక దేవినేని అవినాష్ వెంట నగరంలో తిరగాల్సిన పరిస్ధితి రావడం స్ధానికంగా ఎవరికీ నచ్చడం లేదు. అప్పుడు చంద్రబాబు అనుచరుడిగా ఉన్న స్ధాయి నుంచి వైసీపీలో చేరాక దేవినేని అవినాష్ అనుచరుడిగా నాని మారిపోవడంపై ఆయన అనుచరులే గుర్రుగా ఉన్నారు. దీంతో కేశినేని నాని ఎన్నికల వరకూ వైసీపీలో కొనసాగుతారా లేక మరేదైనా ఆలోచన చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications