జగన్ తెచ్చిన చట్టం ఆయనకు వర్తించదు-భద్రత ఇంతే-హైకోర్టులో తేల్చేసిన రివ్యూ కమిటీ..!
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ కు కల్పిస్తున్న భద్రతపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు చెబుతోంది. పులివెందుల ఎమ్మెల్యేకు ఇంతకు మించి భద్రత ఇవ్వలేమని తేల్చిచెప్పేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో జగన్ తనకు పూర్తి భద్రత కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రివ్యూ కమిటీ స్పందించింది.
మాజీ సీఎం వైఎస్ జగన్ కు రాష్ట్రంలో కల్పిస్తున్న భద్రతపై భద్రతా సమీక్షా కమిటీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో జగన్ కు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు ఇందులో భాగంగా 58 మంది ఆయనకు కాపలాగా ఉన్నట్లు తెలిపింది. ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తులకు 58 మందితో మాత్రమే భద్రత కల్పించాల్సి ఉంటుందని హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది.

వాస్తవానికి వైఎస్ జగన్ సీఎంగా ఉండగా గతేడాది ఏపీ స్పెషల్ సెక్యూరిటీ చట్టం తెచ్చారు. దీని ప్రకారం సీఎంగా ఉండే వ్యక్తికి అదనపు భద్రత కల్పించారు. కానీ ఇప్పుడు ఆయన సీఎంగా లేరు కాబట్టి అది ఎలాగో వర్తించదు. అయితే ఈ విషయం దాచిపెట్టి జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు రివ్యూ కమిటీ గుర్తించింది. ఆ విషయాన్ని అఫిడవిట్లో పేర్కొంది. జూలై 16న రివ్యూ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే జగన్ కు జడ్ ప్లస్ భద్రత కొనసాగుతుంది తెలిపింది. అలాగే తన భద్రతకు ముప్పు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆశ్రయించాలే తప్ప హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయరాదని, ఇప్పటివరకూ అధికారులకు తనకు ముప్పు ఉన్నట్లు జగన్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపింది. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications