చంద్రబాబును గట్టిదెబ్బ కొట్టిన పవన్ ? ఆ ఒక్క లీకుతో- వాడేసుకుంటున్న జగన్-2024 ఆశలపై నీళ్లు
ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అయితే ఇది రాష్ట్ర రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తులుగా ఉన్న సీఎం జగన్ లేదా విపక్ష నేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు లేదా వ్యాఖ్యల వల్ల మాత్రం కాదు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నామమాత్రంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కావడం విశేషం. తాజాగా జనసేనాని ఇచ్చిన లీక్ తో సీఎం జగన్ క్యాంపు ఖుషీఖుషీ అవుతుండగా.. చంద్రబాబు క్యాంప్ మాత్రం ఉసూరుమంటోంది.దీనికి గల కారణాలేంటో ఓసారి చూద్దాం...

పవన్ సంచలన కామెంట్స్
ఏపీ రాజకీయాల్లో జనసేనను బలీయశక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నంలో వేస్తున్న అడుగుల మాటేమో కానీ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మాటతీరుతో పాటు నిర్ణయాల్లోనూ మార్పు వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన వ్యవహరిస్తున్నతీరుపై రాష్ట్రంలో పెద్ద చర్చే జరుగుతోంది.
ఇదే కోవలో ఆయన అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి వరంగా మారాయి. విపక్ష టీడీపీతో పాటు బీజేపీకి సైతం నిరాశ కలిగిస్తున్నాయి.

వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వనంటూ..
తాజాగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహించిన పవన్ కళ్యాణ్..అందులో ఎట్టిపరిస్ధితుల్లోనూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వనంటూ ప్రతిజ్ఞ చేశారు. అంటే విపక్షాలను ఐక్యంగా ఉంచడం ద్వారా 2019లో జరిగిన పొరబాటును రిపీట్ కానివ్వబోనంటూ పరోక్షంగా చెప్పేశారు. అంటే 2024 ఎన్నికల్లో ప్రస్తుతం బీజేపీతో ఉన్న తాను.. టీడీపీని కూడా కలుపుకుని ఉమ్మడిగా పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఆ మాట నేరుగా చెప్పకపోయినా దాదాపు అదే అర్ధం వచ్చేలా చెప్పేసారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైసీపీకి వరంగా మారిపోయాయి.

వాడేసుకుంటున్న జగన్
పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వబోనంటూ ప్రతిన చేశారో అప్పుడే అది వైసీపీకి కొత్త అస్త్రాన్ని ఇచ్చినట్లయింది. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడంటూ తెగ ప్రచారం చేసిన వైసీపీ.. ఆ తర్వాత మాత్రం ఆయన బీజేపీతో జట్టు కట్టడంతో ఆ ప్రచారానికి కాస్త బ్రేక్ ఇచ్చింది.
ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తిరిగి ఆ ప్రచారం మొదలుపెట్టేసింది. స్వయంగా సీఎం జగన్ జిల్లాల యాత్రల్లో చంద్రబాబు దత్తపుత్రుడంటూ పవన్ ను ప్రస్తావిస్తున్నారు. దీంతో వైసీపీ మంత్రులు, నేతలు కూడా జనంలోకి ఇదే విషయాన్ని తీసుకెళ్తున్నారు.
ఇప్పటివరకూ టీడీపీతో జనసేన ఎలాంటి పొత్తు కుదుర్చుకోలేదు. ఎన్నికల ముందు వరకూ పొత్తు కుదుర్చుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అయినా దత్తపుత్రుడు డైలాగ్ మాత్రం ఓ రేంజ్ లో పాపులర్ అయిపోతోంది.

చంద్రబాబుకు భారీ దెబ్బ
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు లేదు. వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారుగా పోటీ చేశారు. ఇద్దరూ నష్టపోయారు. అయితే వీరిద్దరి మధ్య పొత్తు లేకపోయినా పరోక్ష పొత్తు ఉందంటూ వైసీపీ బాగానే ఊదరగొట్టింది. దాని ప్రభావం ఇరుపార్టీలపైనా పడింది. ఇప్పుడు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పడంతో దాన్ని వైసీపీ ఓ రేంజ్ లో వాడేసుకుంటోంది.
దీని ప్రభావం జనసేన కంటే ఎక్కువగా టీడీపీపైనే పడుతోంది. ఎందుకంటే సొంతంగా పోటీ చేసే దమ్ములేదంటూ ఇన్నాళ్లూ టీడీపీపై ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఎన్నికలకు రెండేళ్ల ముందే వారికిసాయం చేస్తానంటూ పవన్ చెప్పేయడంతో ఈ రెండేళ్ల పాటు ఆ నిందని భరిస్తూ టీడీపీ ముందుకెళ్లాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇది చంద్రబాబుకు భారీ దెబ్బగా మారుతోంది. దీంతో దత్తపుత్రుడు డైలాగ్ కు టీడీపీ కూడా కౌంటర్లు వెతుక్కోవాల్సిన పరిస్ధితి దాపురించింది.

వైసీపీ పని మరింత సులువు?
2024 ఎన్నికల నాటికి రాజకీయాలు ఎలా మారతాయో ఎవరికీ తెలియవు. ఇప్పటి నుంచే దానిపై దృష్టిపెట్టి జనంలోకి వెళ్లేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన తాజా,మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకూ జగన్ ఇదే చెప్తున్నారు. అయితే తన పాలనపై వస్తున్నవ్యతిరేకతను అధిగమించేందుకు రాజకీయాల్ని నమ్ముకోవాల్సిన పరిస్ధితి వస్తే మాత్రం జగన్ కు చంద్రబాబు-పవన్ పొత్తు అంశం కలిసి రానుంది.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఇప్పటి నుంచే జనంలోకి తీసుకెళ్లడం ద్వారా 2024 నాటికి తమ పని మరింత సులువు చేసుకోవాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అదే జరిగితే 2024 ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడం చంద్రబాబు-పవన్ ద్వయానికి మరింత కష్టం కానుంది.












Click it and Unblock the Notifications