బీఆర్ఎస్ తో పెను సంచలనాలు-జగన్, చంద్రబాబు, షర్మిలకు మేలు-కేసీఆర్ కు పోలరైజేషన్ సవాల్ !
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పార్టీ బీఆర్ఎస్ స్వరాష్ట్రం దాటి పొరుగున ఉన్న ఏపీలోకి అడుగుపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. తెలుగు రాష్ట్రం కావడం, తమకు మాతృరాష్ట్రం కూడా కావడంతో సులువుగా ఎంట్రీ ఇచ్చేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు ఏపీలో మూడు బహిరంగసభలు కూడా పెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా కేసీఆర్ బీఆర్ఎస్ పై ఏపీ పార్టీలు దాదాపు మౌనంగానే ఉన్నాయి. దీని వెనుక అసలు కారణం ఈ కొత్త పార్టీ రాకతో తమకు అన్నివిధాలా ప్రయోజనం ఉంటుందని అవి భావిస్తుండటమేనని తెలుస్తోంది.

బీఆర్ఎస్ ఎంట్రీ పాలిటిక్స్
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి చూపబోయే ప్రభావంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందులో బీఆర్ఎస్ రాకతో ఏపీలో రాజకీయాలు చేస్తున్న వైసీపీ, టీడీపీ వంటి పార్టీలపై పెను ప్రభావం పడబోతోందని ఇప్పటివరకూ అంతా భావిస్తుండగా..ఇందులో మరో కోణం కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్ రాకతో ఈ రెండు పార్టీలతో పాటు వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీపైనా ప్రభావం పడబోతోంది. అయితే ఇది ప్రతికూల ప్రభావం కాకుండా సానుకూలమే కానుందన్న చర్చ జరుగుతోంది. దీని వెనుక పలు రాజకీయ కారణాలున్నాయి. దీంతోనే ఈ మూడు పార్టీలు ఎక్కువగా స్పందించకుండా మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ, టీడీపీపై బీఆర్ఎస్ ఎఫెక్ట్
బీఆర్ఎస్ ఎంట్రీతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రా కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న వైఎస్సార్సీపీ, టీడీపీ వంటి పార్టీలు ఎక్కువగా ప్రయోజం పొందబోతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాన్ని తెలంగాణ పార్టీగా ప్రచారం చేసేందుకు ఈ రెండు పార్టీలకు మంచి అవకాశం దక్కబోతోంది. అలాగే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్ని ఇప్పటికే పక్కనబెట్టేసిన ఓటర్లకు మరో జాతీయ పార్టీ బీఆర్ఎస్ తోనూ ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేందుకు వీరికి అవకాశం దక్కబోతోంది. ఏపీ విభజన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే అవకాశం దక్కబోతోంది.

తెలంగాణ సెంటిమెంట్ మాయం
బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ ఏపీలో ఓసారి అడుగుపెడితే ఇక మరోసారి తెలంగాణోళ్లు, ఆంధ్రోళ్లన్న వాదనను తెరపైకి తెచ్చే అవకాశాన్ని ఆయన కోల్పోవడం ఖాయం. అలాగే హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ మాయం కావడం ఖాయం. ఇప్పటివరకూ ఏపీకి చెందిన రాజకీయ పార్టీలు కానీ, నేతలు కానీ హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ ఏది మాట్లాడినా సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చే టీఆర్ఎస్ కానీ ఆ పార్టీ నేతలు కానీ, కేసీఆర్ కానీ ఇకపై ఆ వాదనను పక్కనబెట్టాల్సి ఉంటుంది. ఇది అంతిమంగా ఇప్పటికే తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టేసిన జగన్ సోదరి వైఎస్ షర్మిలతో పాటు జగన్, చంద్రబాబుకు సైతం మేలు చేయబోతోంది.

కేసీఆర్ కు పోలరైజేషన్ సవాల్ ?
ఇలా బీఆర్ఎస్ ఎంట్రీతో తెలంగాణ సెంటిమెంట్ విషయంలో ఈసారి ఆంధ్రా రాజకీయ పార్టీలు పైచేయి సాధించేందుకు వీలు కలుగుతోంది. వీరితో పాటు వైఎస్సార్టీపీ వంటి పార్టీలకు కూడా మేలు జరుగుతుంది. అదే సమయంలో ఇప్పటికే బీజేపీతో అంటకాగుతున్న ఈ పార్టీలన్నింటికీ తమ ఓటు బ్యాంకు ఏకీకరణ చేసుకునే అవకాశం కూడా దొరుకుతుంది. బీజేపీ ప్లాన్ లో భాగమైన మతపరమైన ఓట్ల ఏకీకరణ చేసేందుకు ఈ మూడు పార్టీలకు బీఆర్ఎస్ రాకతో అవకాశం కలుగుతుంది. దీన్ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఏం చేయబోతున్నారన్నదే ఇప్పుడు సవాల్ గా మారింది. ఎందుకంటే ఈ పోలరైజేషన్ ను అడ్డుకునే క్రమంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని కూడా రంగంలోకి దింపడం కేసీఆర్ కు కష్టం. ఆయన అడుగుపెడితే ఈ పోలరైజేషన్ మరింత జోరుగా సాగే అవకాశముంది.












Click it and Unblock the Notifications