ఎన్నికల వేళ ప్రధాన ఓట్ బ్యాంక్ పై సీఎం జగన్ బ్రహ్మాస్త్రం ...!!
రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వై నాట్ 175 నినాదం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తన సంక్షేమ పథకాల ఓట్ బ్యాంక ను మరింత బలోపేతం చేసుకొనే నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పాలనలో రూ 2.23 లక్షల కోట్ల లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసారు. ఎన్నికల వేళ ఈ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి అందని వారిని గుర్తించి..వారికి పథకాలను అందించాలని నిర్ణయించారు.
ఓట్ బ్యాంక్ పెంచుకొనేలా
ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అన్నింటా కలిపి కోట్లాది మంది లబ్దిదారులుగా ఉన్నారు. రూ 2.23 లక్షల కోట్ల వీరికి లబ్ది జరిగేలా నిర్ణయాలు అమలు చేసారు. సంక్షేమ పథకాల లబ్ది దారులు అర్హత ఉన్న వారు ఎవరైనా ఈ లబ్ది అందుకోవటంలో మిస్ అయితే వారికి ప్రతీ ఆరు నెలలకు ఒక సారి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.

ఇప్పుడు ప్రభుత్వమే ముందుకు వచ్చి.. ప్రతీ ఇంట అర్హత ఉన్నా పధకాలు అందని వారు ఎవరైనా ఉంటే జల్లెడ పడుతోంది. అర్హత ఉన్న వారిని గుర్తించి వారిని పథకాల్లో లబ్దిదారులుగా చేర్చేందుకు నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దీని ద్వారా ఆగస్టు 1నుంచి వీరికి ప్రభుత్వ పథకాలు అందేలా నిర్ణయం తీసుకుంది.
ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
ప్రతీ ఇంటికి వెళ్లి అర్హత ఉన్న వారిని గుర్తించటం ద్వారా ప్రతీ ఒక్కిరికీ దగ్గర కావాలనేది ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమ పథకాల లబ్దిదారులే తన సైన్యంగా పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి ఆ ఓట్ బ్యాంక్ ను మరింత పెంచుకొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తగిన విధంగా పథకాల్లో లబ్ది దారులుగా చేరేందుకు దరఖాస్తుల సంఖ్య భారీగా వస్తోంది.
సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ ప్రతి ఇంటినీ జల్లెడపెట్టారు. అర్హత ఉండీ, వివిధ కారణాల వల్ల పథకాలు అందకపోయినా, సర్టిఫికెట్లు పొందలేకపోయినా.. వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వీసులన్నింటినీ రిజిస్టర్ చేసిన వారికి టోకెన్లు ఇస్తున్నారు. జగనన్న సురక్ష క్రింద 9లక్షల 48వేల మందికి టోకెన్లు ఇచ్చారు.
భారీగా వస్తున్న స్పందన
ఇదే సమయంలో ప్రతీ ఇంటా అవసరమైన ధృవీరణ పత్రాలు ఉచితంగా అందిస్తున్నారు. అక్కడికక్కడే వాటిని పంపిణీ చేస్తున్నారు. తొలిరోజు పౌరులు అందుకున్న వాటిని పరిశీలిస్తే ఆదాయం, కులం ధృవీరణ పత్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. అలాగే ఖరీఫ్ సీజన్ కావడంతో కాలామంది కౌలు రైతులు సీసీఆర్సీ కార్డులు పొందడానికి ఈ క్యాంపులు ఉపయోగించుకుంటున్నారు.

ఆధార్ డెస్క్‌లో ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ లింకింగ్ సేవలు అందుకున్నారు. మ్యుటేషన్ కోసం చాలామంది తమ సర్వీసులను రిజిస్టర్ చేసుకుంటున్నారు. దీని ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి వారిని పథకాల్లో చేర్చటం.. కావాల్సిన పత్రాలు అందించటం ద్వారా పాలన మరింత చేరువ అవ్వాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. ఎన్నికల వేళ సీఎం జగన్ ప్రతీ అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications