ఏపీలో పందెం కోడి.. రెండురోజుల్లో వంద కోట్లు కొక్కరకో!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు జోరుగా అవుతున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో మాత్రమే కాకుండా కృష్ణాజిల్లాలోని కోడిపందాలు చాలా చోట్ల కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే బరులు ఏర్పాటు చేసి కోడిపందాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కోడిపందాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి పందెం రాయుళ్లు గత రెండు రోజుల నుంచి ఏపీలోనే మకాం వేశారు.
ముఖ్యంగా ఏలూరు జిల్లా దెందులూరు, పెదపాడు, పెదవేగి, కైకలూరు, ఉంగుటూరు మండలాలతో పాటు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పెద అమిరం, ఉండి, ఆకివీడు ప్రాంతాలలో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి. కోడిపందాలతో పాటు బరుల వద్ద భారీగా పేకాట, గుండాట, కోత ముక్క శిబిరాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలు వేయకూడదని చెప్పినా, పోలీసుల ఆదేశాలు ఏమాత్రం లెక్కచేయకుండా పందెం రాయుళ్లు బరితెగించి కోళ్లను బరిలోకి వదులుతున్నారు.

సంక్రాంతి పండగ కోడిపందాలలో వందల కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా కోడి పందాలు కాయడంతో కేవలం రెండురోజుల్లోనే వందకోట్ల మేర బెట్టింగ్‌లు జరిగాయని సమాచారం. కొన్ని చోట్ల ఆటకు కోటి బెట్టింగ్ వేశారని సమాచారం. ఈరోజు కనుమ కావడంతో మరింతగా పందెంరాయుళ్లు రెచ్చిపోతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కరెన్సీని లెక్కపెట్టేందుకు అక్కడకు మనీ కౌంటింగ్ మిషన్లు కూడా తెచ్చారంటే ఏ స్థాయిలో పందెం రాయుళ్లు ఈసారి రెచ్చిపోయారో వేరే చెప్పాల్సిన పనిలేదు.
అంతేకాదు కోడిపందాలు నిర్వహించే చోట యాంకర్ లను కూడా పెట్టి యాంకరింగ్ చేయిస్తున్నారు. ఇక కోడి పందాలు నిర్వహించే చోట మద్యం,మాంసం మాట అయితే చెప్పనక్కరలేదు. తిన్న వారికి తిన్నంత, తాగినోళ్ళకి తాగినంత.. అక్కడ ఫుడ్ మరియు లిక్కర్ బిజినెస్ కూడా జోరుగా సాగుతుంది.
కొన్ని చోట్ల నిర్వహించే కోడి పందాలు చూడాలంటే కచ్చితంగా ఎంట్రీ పాస్ లు ఉండాలి. పాస్ లు లేనివారికి లోనికి ఎంట్రీ కష్టమే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిపందాలు నిర్వహించకూడదని, కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పందెం రాయుళ్లు మాత్రం ఏమాత్రం తగ్గకుండా పందాలను నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications