టీలో కెసిఆర్‌కు సగమే: సీమాంధ్రలో జగన్ హవా

తెలంగాణలో కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏకపక్షంగా విజయం సాధించబోదని, ఒంటరి పోరు చేస్తే హంగ్ శాసనసభ తప్పదని సర్వేలో తేలింది. ఓ తెలుగు టీవి చానెల్ ఎసి నీల్సన్ సహకారంతో నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించింది.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పోటీలో కూడా ఉండదని ఆ సర్వే తేల్చింది. ఈ సర్వే రెండు ప్రాంతాల్లోనూ 40 వేల మందిని ఎంపిక చేసుకుంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ కాస్తా మెరుగుపడిందని సర్వేలో తేలింది.
సర్వే ఫలితాల ప్రకారం - శానససభ ఎన్నికల్లో తెరాస 51 - 57 సీట్లతో అతి పెద్ద పార్టీగా తెలంగాణలో తెరాస అవతరిస్తుంది. తెలంగాణలో 119 శాసనసభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీ 46 నుంచి 52 సీట్లు గెలుచుకుంటుంది. దాంతో తెలంగాణలో త్రిశంకు శాసనసభ ఏర్పడే అవకాశం ఉంది.
తెలంగాణలో టిడిపి 4-6 సీట్లు, బిజెపి 5-8 సీట్లు, మజ్లీస్ 7-8 సీట్లు, ఇతరులు 7-10 సీట్లు సాధించే అవకాశం ఉంది. పోలయ్యే ఓట్ల శాతం కాంగ్రెసుకు 30, తెరాసకు 34, టిడిపికి 13, బిజెపికి 10, వైయస్సార్ కాంగ్రెసుకు 3 ఉంటుంది.












Click it and Unblock the Notifications