అమరావతికి బుల్లెట్ ట్రైన్ , రెండు కారిడార్లు- రూట్, స్టేషన్ల కు కేంద్రం ఆమోదం..!!
ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా మోదీ ప్రభుత్వం కొత్త వరం ప్రకటించింది. చాలా కాలంగా చర్చల్లో ఉన్న బుల్లెట్ రైలు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్-చెన్నై కారిడార్ వయా అమరావతి మీదుగా తాజా ఎలైన్ మెంట్ కు ప్రాధమికంగా ఆమోదం లభించింది. ఈ కారిడార్ లో ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు ఉండనున్నాయి. అలాగే సీమ జిల్లాల నుంచి వెళ్లేలా హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌కు సైతం ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఏపీ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లకు రూట్ క్లియర్ అయింది. హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది సీఆర్డీయే మీదుగా వెళ్లనుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల మీదుగానూ బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టేలా హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ ట్రైన్ కారిడార్ ఎలైన్‌మెంట్‌కూ ప్రాథమిక ఆమోదం లభించింది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్‌రైళ్లు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా, ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ రెండు కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్ల దూరం ఉండనుంది.

ఇక, శంషాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ కోసం 839.5 కిలోమీటర్లు, 749.5 కిలోమీటర్లు, 744.57 కిలోమీటర్లతో 3 ఎలైన్‌మెంట్లను పరిశీలించి, ఇందులో 744.5 కిలోమీటర్ల ఎలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇందులో తెలంగాణలో ఆరు, ఏపీలో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్ నిర్మిస్తారు. ఈ కారిడార్‌లో ఏపీలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ స్టేషన్లు ఉండనున్నాయి. ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్-ముంబయి హైస్పీడ్ ట్రైన్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం/కోదాడ మీదుగా వచ్చి సీఆర్డీయే మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది.
ఇక, అక్కడి నుంచి చీరాలవైపు వెళ్లి విజయవాడ-చెన్నై రైల్వేలైన్‌కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది. ఏపీలో 448.11 కిలోమీటర్లు, తెలంగాణలో 236.48 కిలోమీటర్లు, తమిళనాడులో 59.98 కిలోమీటర్లు దూరం వెళ్తుంది. ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా ఎలైన్‌మెంట్‌లో మారిస్తే తిరుపతికి వెళ్లేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే కారిడార్ మరో 53.5 కిలోమీటర్లు పొడవు పెరుగుతుంది. అప్పుడు నాయుడుపేట, తడ తగలవు. ఈ ప్రాజెక్టులో రెండు వరుసల లైన్, లూప్‌లైన్లు, సైడింగ్స్ కలిపి మొత్తం 1,419.4 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు.












Click it and Unblock the Notifications