కెసిఆర్ రూట్‌లో మెట్రో రైలు: లేఖలపై క్షమాపణలు
హైదరాబాద్: మెట్రో రైలు రూటు మార్పునకు ఎల్ అండ్ టి అంగీకరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిపాదనలకు అంగీకరించింది. అంతేకాకుండా, మెట్రో రైలు ప్రాజెక్టులపై తాము రాసిన లేఖలు మీడియాకు పొక్కడం వల్ల ఏర్పడిన ఇబ్బందులకు కెసిఆర్‌కు క్షమాపణలు చెప్పింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలు దెబ్బతినకుండా, రైలు రూటు మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతిపాదనకు ఎల్‌అండ్‌టీ అంగీకరించింది. రూటు మార్పునకు అయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది.
రూటు మార్పు వల్ల శాసనసభ ముందు, సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో రైలు వెళ్లదు. పాతబస్తీలోనూ కొన్ని మార్పులు జరగనున్నాయి. ఈ అంశంపై శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కో ఎల్ అండ్ టీ చైర్మన్ నాయక్, ఇతర ప్రతినిధులు దాదాపు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో మూడు మార్పులు జరిగాయి.

ఆ ప్రకటన మేరకు - మెట్రో రూటులో మార్పులకు ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు అంగీకరించారు. తాము సూచించినట్లుగా అలైన్‌మెంట్ మార్చడం వల్ల జరిగే అదనపు వ్యయాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కెసిఆర్ స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు వేగంగా పూర్తయ్యేందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 72 కిలోమీటర్ల మెట్రో రైలు కారిడార్‌ను సమీప భవిష్యత్తులో 200 కిలో మీటర్లకు విస్తరిస్తారు.
ఈ భూమిపుత్రులు కారు
మెట్రో రైలు మార్పుపై కెసిఆర్ నిర్దిష్టమైన సూచనలు చేశారు. అందుకు కారణాలు కూడా ఎల్‌అండ్‌టీ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ నగరం ఇన్నాళ్లుగా ఆంధ్రా పాలకుల గుప్పిట్లో ఉందని, వారు ఇక్కడి భూమి పుత్రులు కానందున ఈ నగర స్వరూపస్వభావాలను అర్థం చేసుకోలేకపోయారని, తాము ఇక్కడే పుట్టామని, తమకు మాతృభూమిపై ప్రేమ ఉంటుందని, అందుకు తగినట్లుగానే తన ప్రతిపాదనలు, ప్రయత్నాలు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెట్రో రైలుకు సంబంధించి మొదటి నుంచి తమకు మూడు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
ఆ మూడు మార్పులు ఇవే..
అసెంబ్లీ భవనానికి చాలా చరిత్ర ఉందని, దాని ముందున్న అమరవీరుల స్థూపంతో తమకు భావోద్వేగ సంబంధం ఉందని, అందువల్ల అసెంబ్లీ ముందు నుంచి కాకుండా, వెనుకవైపు నుంచి లైను వేయాలని కెసిఆర్ తెలిపారు. సుల్తాన్ బజార్‌కు కూడా ఎంతో చరిత్ర ఉందని, ప్రస్తుతం ఉన్నఅలైన్‌మెంట్ మార్చి కోఠి ఉమెన్స్ కాలేజీ వెనుక నుంచి రైలుమార్గం వేయాలని సూచించారు. పాతబస్తీలో వేసే లైన్‌ను అక్కడి ప్రసిద్ధ ప్రార్థనా మందిరాల ముందు నుంచి కాకుండా అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరినట్లుగా మార్చాలని చెప్పారు. ఈ మూడు ప్రతిపాదనలకు ఎల్‌అండ్‌టీ యాజమాన్యం అంగీకరించినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
అలైన్‌మెంట్ మార్పులకు సంబంధించి ఈ నెల 20వ తేదీన మళ్లీ సమావేశమై లేఔట్ రూపొందించుకోవాలని రెండు పక్షాలు నిర్ణయించాయి. ఈ సమావేశానికి పాతబస్తీ ప్రజా ప్రతినిధులను సైతం ఆహ్వానించాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రో కారిడార్‌లో కొన్ని ఆస్తుల సేకరణలో ఇబ్బందులునందునే పూర్తిస్థాయి రైట్ ఆఫ్ వే ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి చెప్పారు.
మెట్రో పనులు మరింత వేగంగా జరిగేందుకు అవసరమైన భూసేకరణ, కోర్టు వివాదాల పరిష్కారాలు, ట్రాఫిక్ నియంత్రణలు తదితర అంశాలపై త్వరితగతిన స్పందించాలని అధికారులకు సూచించారు. మెట్రో రైలుతోపాటు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే ప్రతిష్ఠాత్మక అభివృద్ధి ప్రాజెక్టుల్లోనూ భాగస్వామి అయ్యేందుకు ఎల్‌అండ్‌టీ అంగీకరించిందని సీఎంవో కార్యాలయం తెలిపింది.












Click it and Unblock the Notifications