నేను సినిమాలు చేయాలంటే: జగన్‌పై పవన్ నిప్పులు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికీ పదవీకాంక్ష లేకుంటే ఆంధ్రప్రదేశ్ చీలి ఉండేది కాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం అన్నారు. జగన్ సొమ్ము జనానిదే అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటుకు రూ.పదివేలు ఇస్తే తీసుకొని... ఓటు మాత్రం బిజెపి, టిడిపి కూటమికి వేయాలన్నారు. జగన్‌కు జైలు అనుభవముంటే, చంద్రబాబుకు పాలనానుభవం ఉందన్నారు.
తనకు పదవి అక్కర్లేదని, సామాన్యుడిగా ఉంటానని జగన్ అనుకుంటే రాష్ట్రం విడిపోయేది కాదన్నారు. ప్రస్తుత ఎన్నికలు తెలుగు జాతి ఐక్యకతకు పరీక్ష వంటివన్నారు. తన తండ్రి మృతి చెందిన మూడు రోజుల తర్వాత షూటింగుకు హాజరు కావాల్సి వచ్చిందని, తన స్థానాన్ని భర్తీ చేసే మరో వ్యక్తి లేనందునే తాను వెళ్లానని కానీ, వైయస్ అంత్యక్రియల పూర్తి కాకుండానే జగన్ పదవి కోసం పాకులాడటం బాధ అనిపించిందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఓడిస్తే తాను మళ్లీ ఉద్యమాలకు రానవసరం లేదని, సినిమాలు చేసుకుంటానని చెప్పారు. తాను సినిమాల్లో కొనసాగాలంటే జగన్ పార్టీని ఓడించాలన్నారు. లేదంటే తాను మళ్లీ ఉద్యమ బాటపట్టక తప్పదన్నారు. తాను సినిమాలు కొనసాగించాలంటే టిడిపి, బిజెపిలకు ఓటేయాలన్నారు. కెసిఆర్ పదేళ్లపాటు సీమాంధ్రులను నాలుకలు కోస్తా... చీరేస్తా అంటుంటే జగన్ ఎప్పుడు పల్లెత్తు మాట మాట్లాడలేదన్నారు. వారిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నారు.
వాడెవడో... అంటూ కెసిఆర్ చిటికెలు వేస్తూ తనను హెచ్చరించారని.. కానీ వాటికి తాను భయపడననన్నారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడానని తన పైన కేసులు పెట్టారని, రేపు హైదరాబాద్ వెళ్లాక జైల్లోను పెట్టవచ్చన్నారు. భౌతిక దాడులు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. తాను వాటికి భయపడనన్నారు.
కోపం వస్తే అభిమానులతో కలిసి సామూహికంగా నడిచి వెళ్తానని, తొక్కుకుంటూ వెళ్తామన్నారు. తనకు పదవులే కావాలనుకుంటే ప్రజారాజ్యం తరఫుననే పోటీ చేసే వాడినన్నారు. తనకు పాలనానుభవం లేనందునే జనసేన పార్టీని పెట్టినా పోటీ చేయడం లేదని చెప్పారు. చంద్రబాబు, మోడీలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications