ప్రధాని పదవి కోరికపై చంద్రబాబు, 'అన్నీ నేనే చేస్తే మీరేం చేస్తారు'
విజయవాడ: తనకు ప్రధానమంత్రిని కావాలన్న కోరిక ఏమాత్రం లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించి, అగ్రగామిగా నిలపాలన్నదే తన కోరిక అన్నారు.
విద్యార్థుల్లో కుల మతాలకు అతీతంగా ప్రతిభను వెలికితీయాల్సి ఉందన్నారు. విదేశీ విద్యార్థులు ఏపీకి వచ్చి విద్యను అభ్యసించేలా అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఏపీ ఎడ్యుకేషన్ హబ్ అవుతుందన్నారు. మరో మూడు నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, కాలేజీల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు.

అన్నీ నేనే చేస్తే మీరేం చేస్తారు
అన్నీ నేనే చేస్తే మీరేం చేస్తారని చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం తాను ఇరవై నాలుగు గంటలూ కష్టపడుతుంటే మీరు ఇళ్లలో పడుకుంటానంటే కుదరదన్నారు. రేషన్ దుకాణాల్లో పామాయిల్, కందిపప్పు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తిని ఉద్దేశించి చంద్రబాబు పై విధంగా వ్యాఖ్యానించారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ గూడవల్లి సీతారామస్వామి ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు విగ్రహాన్ని చంద్రబాబు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిలిపేందుకు నిరంతరం కష్టపడుతున్నానన్నారు. చంద్రబాబు మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కల్పించుకుని తమకు రేషన్ షాపుల్లో పామాయిల్, కందిపప్పు ఇవ్వడం లేదన్నారు. దీంతో చంద్రబాబు అతడికి చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications