పవన్ కళ్యాణ్ పార్టీతో నష్టం ఉండదు: దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొత్తగా జనసేన పార్టీ నెలకొల్పడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్, ఏఐసిసి కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చని ఆయన అన్నారు. పవన్ పార్టీతో తమకు వచ్చే నష్టమేమి లేదని తెలిపారు. శుక్రవారం తెలంగాణ పిసిసి నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు మాట మార్చడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పిన కెసిఆర్ తెలంగాణ ఇచ్చాక తాము విలీనం చేయబోమని ప్రకటించడం తనకు ఆశ్చార్యాన్ని కలిగించిందని అన్నారు. అయితే కెసిఆర్ తీసుకున్న రాజకీయ పరమైన నిర్ణయాన్ని గౌరవిస్తామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. విలీనం అంశం టిఆర్ఎస్ వ్యక్తిగతమని చెప్పారు. తాను విలీనం లేదా పొత్తు అంశాలపై టిఆర్ఎస్ పార్టీ నేత కేశవరావుతో ఫోన్‌లో మాట్లాడనని తెలిపారు. సిపిఐ పార్టీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని, గతంలో కూడా ఆ పార్టీతో కలిసి పనిచేశామని చెప్పారు.

అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట తప్పారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టడం బాధాకరమని ఆయన తెలిపారు. పార్లమెంటులో విభజన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి ఏం కావాలో అడగకుండా ఆ ప్రాంత ఎంపీలు సభను అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు.
సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించనున్నట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంతోపాటు సీమాంధ్రను అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతామని అన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు. దశాబ్ధాల కాలంగా కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమానికి న్యాయం చేశామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
మధ్యప్రదేశ్ నుంచి విడదీసిన తర్వాత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి మేలే జరిగిందని చెప్పారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకరించినందువల్లే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మార్చి 28 నాటికి విభజన ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. గురువారం, శుక్రవారం తెలంగాణ పిసిసి నాయకులతో భేటీ అయినట్లు తెలిపారు. శనివాంర ఆంధ్రప్రదేశ్ పిసిసి నేతలతో భేటీ కానున్నట్లు దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
రఘువీరారెడ్డి సమర్థుడనే సీమాంధ్ర పిసిసి చీఫ్ పదవి అప్పగించామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే రాష్ట్ర నాయకులను సంప్రదించవచ్చని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డిఎన్‌ఏనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలో ఉందనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. జగన్ తండ్రి, తాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications