రఘువీరాకు పవన్ అభినందన: కానీ, అంతలోనే, ''చంద్రబాబు మోసం''
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డిని జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభినందించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభకు ఆహ్వానం అందినట్టు పవన్ చెప్పారు.అయితే ఈ సభకు తాను హజరుకావడం లేదన్నారు. సమయం లేని కారణంగానే తాను ఈ సభకు హాజరుకావడం లేదని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ప్రత్యేక హోదా కోసం గుంటూరు వేదికగా ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తోంది.అయితే ఈ సభకు వైసీపీ చీఫ్ జగన్ , జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ తో పాటు వివిద పార్టీల జాతీయనాయకులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.
అయితే ఈ సభపై టిడిపి తీవ్రంగా విమర్శలు చేస్తోంది.రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పేరుతో సభలు నిర్వహించడాన్ని తీవ్రతప్పుబట్టింది.
మరోవైపు ప్రత్యేక హోదా కోసం జరిగే ప్రతి కార్యక్రమంలో తాము పాల్గొంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.అంతే కాదు ఈ విషయమై తమతో కలిసివచ్చే పార్టీలను కూడ కలుపుకొని పోరాటాలు నిర్వహించనున్నట్టు కూడ ఆ పార్టీ ప్రకటించింది.

ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతు
ప్రత్యేక హోదా కోసం నిర్వహించే ఏ పోరాటానికైతాన తన మద్దతు ఉంటుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ గుంటూరులో నిర్వహిస్తున్న సభకు తాను హాజరుకావడం లేదన్నారు. అయితే సమయం లేని కారణంగానే తాను గుంటూరు సభలో పాల్గొనడం లేదని పవన్ ప్రకటించారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని ఆయన సూచించారు.ఈ విషయమై పోరాడే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

వాళ్ళు అభివృద్ది నిరోధకులు
కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ప్రత్యేక హోదా కోసం భరోసా పేరుతో నిర్వహించే సభకు వెళ్ళేవారంతా అభివృద్ది నిరోధకులేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు చెప్పారు.కాంగ్రెస్ సభకు ప్రజలు వెళ్ళకపోవడమే ఆ పార్టీని నిజమైన గుణపాఠమన్నారు. ఈ సభకు వెళ్లడమంటేనే రాష్ట్రాభివృద్దిని వ్యతిరేకించడమేననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో చట్టం చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాటకమాడుతోందన్నారు మంత్రి.కాంగ్రెస్ పార్టీ విభజనపై పుండు మీద కారం చల్లుతోందని ఆన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సభల ద్వారా తెలుగువారి పౌరుషాన్ని సవాల్ చేస్తుందా అంటూ మంత్రి ప్రశ్నించారు.

ఆంధ్రులను చంద్రబాబు నిలువునా మోసం చేస్తున్నారు
విభజన చట్టంలోని హమీలు సాధించుకొనే దమ్ము లేకనే కాంగ్రెస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిందలు వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపి కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వివిద పార్టీలకు చెందిన జాతీయ నాయకులు మద్దతిస్తున్నా చంద్రబాబు మాత్రం కళ్ళు తెరవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రెండు కళ్ళ సిద్దాంతం, నేడు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్రులను సీఎం నిలువునా మోసం చేస్తున్నారని కేవీపి ఆరోపించారు.

ప్రత్యేక హోదా అవసరం లేదు
ప్రత్యేక హోదా అవసరం లేదు. హోదా కంటే మెరుగైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం ప్రకటించింది.ఈ ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ సానుకూలంగా స్పందించింది.నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ అరవింద్ పనగారియా కూడ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం అంటూ ప్రకటించారు. అయితే ఈ విషయమై మరోసారి కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించడం ద్వారా రాజకీయంగా టిడిపిని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications