మోడీపై నమ్మకం ఉంది, బిజెపితో పొత్తుకు సిద్ధం: జెపి
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీతో పొత్తుకు తాము సిద్ధమే అని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రకటించారు. శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశానికి సుస్థిర పాలన అందించగలరని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన ఇస్తామని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
మోడీ సుస్థిర పాలన అందిస్తారని విశ్వాసమున్నందునే బిజెపి, తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు. పొత్తులపై జాప్యం చేయడం సరికాదని ఆయన సూచించారు. రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తున్న పార్టీలకు ఆ హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించిన జెపి, దీనిపై రిజర్వు బ్యాంకుకు లేఖ రాస్తామని తెలిపారు.

రుణమాఫీ వల్ల రైతులు నష్టపోతారని జెపి అన్నారు. రైతులకు కావాల్సింది రుణమాఫీ కాదు, లాభసాటి ధర ఉండాలన్నారు. రైతులు ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశాలు కల్పించాలన్నారు.
వస్తు ఉత్పత్తి రంగాలను మెరుగు పరిచి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. వచ్చే పదేళ్లలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే దేశంలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయని జెపి అన్నారు.












Click it and Unblock the Notifications