అసెంబ్లీలో అడుగుపెడతా.. ఎవరడ్డుకుంటారో చూస్తా: ‘సీఎం’ పదవిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
కాకినాడ: ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వారాహి విజయయాత్రలో భాగంగా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదని తనపై కక్షకట్టి పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓడించారని గుర్తు చేశారు. ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా దమ్ముంటే అడ్డుకోవాలని సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు.
గాజువాకలో తనను గెలిపించి ఉంటే కనీసం రూషికొండనైనా కాపాడేవాడినని పవన్ చెప్పారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ఆయన స్ఫష్టం చేశారు. అమరావతిలో రైతుల ఆత్మహత్యలకు వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిని ఎందుకు వ్యతిరేకించలేదని సీఎంను ప్రశ్నించారు. రాజధానిపై కుల ముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు.

ఎన్నికల్లో మద్యపాన నిషేధమని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంపై ఏటా రూ. 25వేల కోట్ల ఆదాయం పొందుతోందని విమర్శించారు. సీపీఎస్ రద్దు చేస్తామని గొప్పగా చెప్పారు కానీ.. చేతల్లో చూపించలేదన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ.. ఒక్క సీటు లేని జనసేనను టార్గెట్ చేసిందంటే వారికి మనమంటే ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు పవన్. భవిష్యత్తులో వైసీపీని ఎదుర్కొనేది జనసేన మాత్రమేనన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం చాలా అవసరమన్నారు పవన్. అక్రమంగా వేలకోట్లు కూడబెట్టినవారితోనే తన గొడవ అని అన్నారు. సీఎ అవినీతిని అడిగే వ్యక్తులు ఎవరున్నారని ప్రశ్నించారు. తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటామన్నారు. తమను పాలించేవారు తమకంటే నిజాయితీపరులుగా ఉండాలన్నారు. విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం మాత్రం ఖాయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఈసారి జనసేన అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తాను!
— JanaSena Party (@JanaSenaParty) June 14, 2023
- వారాహి విజయ యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్#VarahiVijayaYatra #WarriorOnVarahi pic.twitter.com/eUAiQenwXf
మొత్తం రాజకీయం ఆంధ్రా నుంచే చేస్తానని పవన్ చెప్పారు. కుండబద్దలు కొట్టి చెబుతున్నా.. అసెంబ్లీలో ఉండేందుకు ఎన్ని వ్యూహాలైన అనుసరిస్తా. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తా. నన్ను విమర్శించే నాయకులందరి వ్యక్తిగత విషయాలు తెలుసు.. కానీ సంస్కారంతో నేను భయటపెట్టడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Massive crowd are running in roads to see @PawanKalyan 🥹❤️
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) June 14, 2023
#VarahiVijayaYatra
pic.twitter.com/7w5Ci9q8st
పార్టీని పదేళ్లు నడపడం సాధారణ విషయం కాదన్నారు పవన్ కళ్యాణ్. పార్టీని నడిపేందుకే తాను సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. తనపై కక్షతో తన సినిమాలు అడ్డుకున్నారని చెప్పారు. సినిమా టికెట్ల మీద కూడా దిగజారిన వ్యక్తి ఈ సీఎం అని ధ్వజమెత్తారు. తన బిడ్డల కోసం దాచిపెట్టిన నిధితో పార్టీ ఆఫీసు కట్టానని పవన్ తెలిపారు.
తన బిడ్డల బదులు.. మీరంతా తన బిడ్డలను అనుకున్నట్లు పవన్ చెప్పారు. ఒక వ్యక్తి బలిదానం ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్న పవన్.. నేతలు పొట్టి శ్రీరాములు పేరుతో సభపెట్టి వదిలేస్తున్నారన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని జనసేన గుండెల్లో పెట్టుకుందన్నారు. తాను ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని స్పష్టం చేశారు పవన్.












Click it and Unblock the Notifications