మోడీకైనా మద్దతు: జగన్, ఎంతకైనా తెగిస్తారని బాబుపై
కృష్ణా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ 20 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుందని, దేశ ప్రధానిని నిర్ణయించడంలో తామే కీలక పాత్ర పోషిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తానంటే వారికే తన మద్దతని చెప్పిన ఆయన, మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతానంటే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకైనా మద్దతు ఇస్తానని చెప్పారు. శనివారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నిర్వహించిన రోడ్‌షోలు ఆయన ప్రసంగించారు.
తెలంగాణలో ఎన్నికలయ్యే వరకూ ఒకలా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బిజెపి నాయకులు, ఏప్రిల్ 30 తర్వాత మరోలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసిన టిడిపి, బిజెపి నేతలు, సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తామే ప్రయత్నం చేశామని చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు.

బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటుండగా, తాను లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని చంద్రబాబు చెప్పుకుంటున్నారని జగన్ అన్నారు. సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో మాత్రం విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నించామని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు.
1999 నుంచి 2004 వరకు రాష్ట్రంలో టిడిపి, దేశంలో బిజెపి అధికారంలో ఉందని.. అప్పుడు సీమాంధ్రకు ఏం చేయలేని నాయకులు, ఇప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తామనడం ఏంటని జగన్ ప్రశ్నించారు.
నరేంద్ర మోడీ, చంద్రబాబు తమ మాటలతో సీమాంధ్ర ప్రజలను స్వర్గానికి తీసుకెళుతున్నట్లు చేస్తున్నారని ఆరోపించారు. మన రాష్ట్రంలోని గ్యాస్‌లో మన రాష్ట్రానికి వాటా ఇవ్వకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తామనడం ఏంటని జగన్ ప్రశ్నించారు. అధికారం కోసం ఏ గడ్డయినా తినేందుకు రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నారని జగన్ ఆరోపించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం మనిషిని, పార్టీని లేకుండా చేసేందుకు, జైలుకు పంపేందుకు కూడా వెనకాడటం లేదని జగన్ విమర్శించారు.












Click it and Unblock the Notifications