పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి: వర్మపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
కాకినాడ: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీయే కూటమి కార్యకర్తలతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అధికార వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ ముగిసేవరకూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు.
టీడీపీ పీఠాపురం ఇంచార్జ్ వర్మ త్యాగం గొప్పది.. ఆయన్ను ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తానని పవన్ హామీ ఇచ్చారు. చరిత్రలో నిలిచిపోయేలా పిఠాపురంలో మనం గెలవాలని అన్నారు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని నేతలకు సూచించారు. కొన్ని లక్షలతో పూర్తయ్యే పనులు సొంతంగా చేద్దామని పవన్ తెలిపారు.

తాను రాష్ట్ర ప్రజల కోసం తగ్గానని పవన్ చెప్పారు. చంద్రబాబు చాలా అనుభవజ్ఞుడన్నారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు తెలుగు తమ్ముళ్ల బాధ తనను కదిలించిందని పవన్ చెప్పారు. టీడీపీ ఎంతో సమర్థవంతమైన పార్టీ అన్నారు. స్ట్రక్చర్ కలిగిన పార్టీని నడపడం అంత సులువు కాదన్నారు. జనసేన దగ్గర స్ట్రక్చర్ లేదు కానీ.. బలం ఉందన్నారు. ఆ బలం స్ట్రక్చర్ తో కలిసి ముందుకు వెళితేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు పవన్. తన కోసం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటును త్యాగం చేసి తన గెలుపునకు సహకరిస్తామనడం శుభ పరిణామమన్నారు. చంద్రబాబు చెప్పారు తాను చేస్తానని వర్మ ఒకే మాట చెప్పారని తెలిపారు. ఒంటరిగా పోరాడి గెలిచే దమ్మున్న నాయుడు వర్మ అని ప్రశంసించారు. కానీ, రాష్ట్రం బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఆయన సీటు త్యాగం చేయడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు.
టీడీపీ, బీజేపీ హక్కులకు, రాజకీయ మనుగడకు ఇబ్బంది లేకుండా పనిచేస్తామన్నారు పవన్. జనసేన, టీడీపీ నాయకుల మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే సర్దుకుపోవాలని పవన్ సూచించారు. పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలని.. ఆ బాధ్యతను వర్మకు అప్పగిస్తున్నట్లు పవన్ చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్ పోటీ చేసే పిఠాపురంలో రెండు విడతలుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మొదటి విడతగా నేటి పర్యటన ముగిసింది.
మళ్లీ ఏప్రిల్ 9న పిఠాపురంలో నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారని నాదెండ్ల తెలిపారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8 కాకినాడ గ్రామీణం, 10న రాజోలు, 11 పి గన్నవరం, 12 రాజానగరంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ఇది మొదట విడత జరిగే ప్రచార కార్యక్రమని తెలిపారు. ఇది పూర్తైన వెంటనే రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications