ఇకపై సహించను, ఎవరైనా సరే ముందు వేటు.. తరువాతే విచారణ : చంద్రబాబు వార్నింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విశాఖ జిల్లాలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు వ్యక్తిగత విభేదాలతో తరచూ రచ్చకెక్కడం, ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినకుండా బహిరంగ విమర్శలకు దిగడంపై ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఈ ఇద్దరు మంత్రుల నడుమ విభేదాల గురించే ప్రధానంగా చర్చించారు. గంటా, అయ్యన్నల వ్యవహారం తలనొప్పిగా మారడంతో... ఐక్యంగా ఉండాలని ఇద్దరికీ చంద్రబాబు ఇదివరకు పలు దఫాలు నచ్చజెప్పారు. ఆయన చెప్పాక కొన్నాళ్లు బాగానే ఉంటున్నారు. మళ్లీ ఏదో ఒక అంశంపై ఇద్దరూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

అధికార పార్టీ మంత్రే అలా...

అధికార పార్టీ మంత్రే అలా...

విశాఖలో ఇటీవల భూ రికార్డుల తారుమారు వ్యవహారంతో పెద్ద దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వం సిట్‌ దర్యాప్తునకు ఆదేశించింది. అంతకంటే ముందే భూముల అవకతవకలకు కొందరు టీడీపీ నాయకులే కారణమంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు పరోక్షంగా విమర్శలు చేశారు. దీన్ని విపక్షాలు అవకాశంగా చేసుకున్నాయి. మీ మంత్రే చెబుతున్నారు కాబట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగాయి. దీంతో వ్యవహారం మరింత జటిలంగా మారింది.

విభేదాలతో పార్టీకే నష్టం...

విభేదాలతో పార్టీకే నష్టం...

మంత్రి అయ్యన్న తనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న భావనతో గంటా ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి, భూముల వ్యవహారంపై సీబీఐతోగానీ, సీబీసీఐడీతోగానీ, హైకోర్టు సిటింగ్‌ జడ్జితోగానీ విచారణ జరిపించాలని కోరారు. ఒక లేఖ కూడా అందజేశారు. ఇద్దరూ సీనియర్‌ నాయకులు కావడం, సమస్య సున్నితంగా మారడం, వారిద్దరి విభేదాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుండటంతో ఇకనైనా శాశ్వత ముగింపు పలకాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి త్రిసభ్య కమిటీని నియమించారు.

ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు...

ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు...

ఇక భూ వివాదాల్లో చిక్కుకుని అరెస్టయిన టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండు చేశారు. సమన్వయ కమిటీ సమావేశంలో విశాఖ భూముల వ్యవహారం, మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య వివాదం ప్రస్తావన వచ్చినప్పుడు మంత్రులిద్దరినీ బయటకు వెళ్లమని చెప్పి చర్చ కొనసాగించారు. తాను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత కూడా నేతల్లో మార్పురాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏం చేద్దాం? కమిటీయే బెటరా?

ఏం చేద్దాం? కమిటీయే బెటరా?

విశాఖలో మంత్రులు, విజయవాడలో ఎంపీ కేశినేని నాని, నంద్యాలలో పార్టీ నేతల వ్యవహారశైలి సరిగా లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఇక క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై ముందు చర్యలు చేపట్టి, ఆ తర్వాతే విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. ‘విశాఖ వ్యవహారంపై ఏం చేద్దాం? మంత్రులిద్దర్నీ నేను కూర్చోబెట్టి మాట్లాడాలా?' అని సభ్యుల అభిప్రాయం కోరారు. కమిటీ వేయడమే మంచిదని మంత్రి యనమల తదితరులు సూచించడంతో... త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించారు. కమిటీలో యనమలతో పాటు మరో ఇద్దరు సభ్యులుగా ఉంటారు. రెండు మూడు రోజుల్లో కమిటీ నివేదిక అందజేస్తుంది. దాని ఆధారంగా ఎవరిపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది నిర్ణయిస్తారు.

కావాలనే అసత్య ప్రచారం...

కావాలనే అసత్య ప్రచారం...

శాసనసభలో విపక్ష నేత జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లు వచ్చిన విషయంలో కావాలనే ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మరిన్ని అసత్య ప్రచారాలు వస్తాయని, ప్రజలు దీన్ని అర్ధం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశంలో వ్యాఖ్యానించారు. సంఘటన జరిగినప్పుడు వైకాపా ఎమ్మెల్యేలతో పాటు, మీడియాను లోపలికి అనుమతించి ఉంటే సరిపోయేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

క్రమశిక్షణ ఏదీ?

క్రమశిక్షణ ఏదీ?

‘సీనియర్లే ఇలా ఉంటే ఎలా? సరిగ్గా పనిచేయని వాళ్లను పక్కనపెట్టి మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకున్నాం. ఇంకా సమర్థంగా పనిచేయాలనుకుంటున్న తరుణంలో ఇలాంటి వివాదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. ఏదైనా ఉంటే నాకు చెప్పాలి. పార్టీలో ఒకప్పుడున్న క్రమశిక్షణ ఇప్పుడేమైంది? నేను క్రమశిక్షణగా ఉండటంవల్లే జీవితంలో విజయవంతమయ్యా..' అంటూ చంద్రబాబు హితవు పలికారు.

ఇలాంటి తరుణంలోనా?

ఇలాంటి తరుణంలోనా?

‘ఈ మూడేళ్లలో ప్రభుత్వంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ వచ్చాం. పార్టీ పరంగా మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరు పార్టీ నాయకులు క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారు. పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు. మనం ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇలాంటి సమయంలో అందరూ సహకరించకుండా ఎవరిష్టానికి వాళ్లు వ్యవహరించడం సరికాదు..' అని చంద్రబాబునాయుడు ఇద్దరు మంత్రులకు క్లాస్ పీకారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chief Minister, TDP National President Nara Chandrababu Naidu fired on Ministers Ganta Srinivasa Rao and Ayyannapatrudu on Thursday at his undavalli residence in a co-ordination meeting.
Please Wait while comments are loading...