మందగించిన నైరుతి, మళ్లీ భగభగ - ఈ జిల్లాల్లో మాత్రం.. తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ముందస్తుగానే వచ్చిన నైరుతి మందగిం చింది. నైరుతి రాకతో చల్లబడిన వాతావరణంలో మార్పు మొదలైంది. వరుసగా వర్షాలు కురిసిన జిల్లాల్లో తిరిగి వేడి పెరుగుతోంది. ఉక్కపోత కొనసాగుతోంది. రెండు రోజులుగా రుతుపవనాలు మందగించటంతో ఈ మార్పులు వచ్చినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని పలు జిల్లాలకు హెచ్చరిక చేసింది.
నైరుతి రుతుపవనాల విస్తరణ తర్వాత రెండు, మూడు రోజులు కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పడమర దిశ నుంచి పొడిగాలులు వీయడంతో ఒక్కసారిగా ఎండ, వేడి వాతావరణం పెరిగింది. పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని, ఎండతీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా, సోమవారం అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

అదే విధంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఆదివారం అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు తెలంగాణలోనూ సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం గరిష్టంగా నల్గొండలో 39.5 డిగ్రీలు, కనిష్టంగా మహబూబ్‌నగర్‌లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల వేళ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడి, ఉక్కపోత పెరగటం తో మళ్లీ వేసవి ఇబ్బందులు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications