imd: మండే ఎండల్లో ఏపీకి చల్లని కబురు
భారతదేశానికి వర్షాలను మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికన్నా ముందే కేరళను ముద్దాడాయి. రెండురోజుల నుంచి 'గాడ్స్ ఓన్ ప్లేస్' అని పిలవబడే ఈ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. కేరళ నుంచి కర్ణాటక మీదగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. రాబోయే రెండుమూడు రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ మీదగా రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించబోతున్నాయి.
తేలికపాటి జల్లులు పడతాయి
కోస్తా, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంవల్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, . అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురియడానికి అవకాశం ఉంది. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి చినుకులు రాలనున్నాయి.

వీటీ అగ్రహారంలో 83 మిల్లీమీటర్లు
శనివారం తెల్లవారుజామున ఉత్తరాంధ్రలో ఉరుములు, పిడుగులతో వానలు పడ్డాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో విజయనగరం జిల్లా వీటీ అగ్రహారంలో 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్ నినో బలహీనపడి లానినో ఏర్పడుతోందని, దీనివల్ల ఈ సీజన్ లో కావల్సినంత వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రెమాల్ తుఫాను, రుతుపవనాల పురోగమనంతో రోహిణీకార్తె ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేదని చెప్పొచ్చు. గత వారం రోజుల్లో మాత్రం స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. ఆవులు, మేకలు మృతిచెందగా మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.












Click it and Unblock the Notifications