కరువు తీరేలా కుండపోత - మరో రెండు రోజులు దంచుడే.. తాజా హెచ్చరిక...!!
వేసవి తరహా ఎండలు.. ఉక్కపోత వేళ భారీ వర్షాలు బిగ్ రిలీఫ్ ఇస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ సమయంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాలపై కేంద్రీకృతమైన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలుగు రాస్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి.
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కాగా.. రాగల మూడు గంటలు కాకినాడ, విశాఖ ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. పిడుగులు, ఈదురుగాలుల వేళ చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా రైతాంగానికి ఊపిరినిచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు వర్షాలు పెరిగాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాలు ఖరీఫ్ పంటలకు తాత్కాలికంగా ప్రాణం పోశాయని చెబుతున్నారు.

మరో రెండు రోజులు వర్షాలు
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అత్యధికంగా 10.8 సెం.మీ., ఇరగవరంలో 10.7, పెనుమంట్రలో 10.4, ఆచంటలో 9.76, గణపవరంలో 9.74, కోనసీమ జిల్లా మలికిపురంలో 7.97, శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 7.38, కవిటిలో 6.34, విజయవాడ రూర ల్‌లో 6.14, కోనసీమ జిల్లా పి.గన్నవరంలో 6 సెమీ వాన పడింది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం మన్యం, పోలవరం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించింది. అటు తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం కూడా రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం.. ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో వర్షం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications
