వాయుగుండం, భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈ నెల 26,27 తేదీల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 25న (గురువారం) ఏర్పడే అల్పపీడనం 26 నాటికి వాయుగుండంగా బలపడి 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. తెలంగాణ జిల్లాలకు భారీ వర్షం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నందున ఎల్లో అలెర్ట్ జారీ చేశామని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూరు గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ , ఈనెల 26 ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయనున్నామని వివరించారు. ఈనెల 27న కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, మత్య్యకారులు వేట నుంచి వెనక్కి రావాలని సూచించారు.

కాగా, గడిచిన 24 గంటల్లో రణస్థలంలో 9 సెం.మీ, మెరకముడిదాంలో 7 , చోడవరం, అనకాపల్లి లో 7 సెం.మీటర్ల వర్షం నమోదయ్యిందని వెల్లడించారు. ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి. ఈనెల 26వ తేదీన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వివరించింది. ఈనెల 27న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవనున్నాయి.












Click it and Unblock the Notifications