మరో అల్పపీడనం, దంచికొడుతున్న వానలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వరుస అల్ప పీడనాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే ఆరు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏపీలో పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. రాయలసీమ జిల్లాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కర్నూలు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆస్పరి మండలంలో పుప్పాలదొడ్డి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆదోని మండలంలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బసాపురం గ్రామంలో మేక దూడ వంక పొంగి పొర్లుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి.

కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలో 1,99,714 క్యూసెక్కులు చేరుతోంది. జలాశయం నుంచి ఔట్ ఫ్లో 1,00,800 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,485 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.20 అడుగులకు పెరిగింది. రానున్న వారం రోజుల్లో సీమ జిల్లాలతో పాటుగా కోస్తా ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అలర్ట్స్ తో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది.












Click it and Unblock the Notifications