ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్ - అప్రమత్తంగా ఉండాల్సిందే..!!
రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తాజా సూచన చేసింది. సెప్టెంబర్ 7 వ తేదీవరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు పడటంతో పాటుగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో ప్రయాణాలపైన జాగ్రత్తగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. తాజా వర్ష సమాచారం తో రైతులకు కలిసి వచ్చే అవకాశం ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్ది రోజులుగా వర్షాల కోసం నిరీక్షణ మొదలైంది. రైతులకు వర్షాలు లేక కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. కరువు మండలాల ప్రకటన పైన చర్చ మొదలైంది. అయితే, సెప్టెంబర్ తొలి వారంలో వర్షాలు కురుస్తాయనే అంచనాలతో వేచి చూస్తున్నారు. ఇదే సమయంోల తాజాగా ఐఎండీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపైన కీలక అప్ డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 7 వ తేదీవరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఏపీకి సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి5.8కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది.

సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు, భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూఅక్కడక్కడ తేలికపాటి నుండి భారీ అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు బలంగా వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బలమైన గాలులు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.












Click it and Unblock the Notifications