Amaravati : అమరావతికి కేంద్రం మరో ఝలక్ ? ఇక ఆ ఆశలూ గల్లంతు..!
ఏపీలో రాజధానిగా అమరావతిని గతంలో టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసినప్పుడు పూర్తి మద్దతు ప్రకటించిన బీజేపీ.. ఆ తర్వాత పలు ప్రాజెక్టులు ఇచ్చేందుకు సై అంది. కానీ ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో నిధుల కేటాయింపులు క్రమంగా తగ్గిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు మరిన్ని నిధులు కేటాయించేందుకు ససేమిరా అంటోంది. గతంలో ఆమోదించిన ప్రాజెక్టులకు నిధులు ఇచ్చామని, ఇకపై మరిన్ని నిధులు మాత్రం ఇవ్వలేమంటోంది.
అమరావతిలో గతంలో ప్రతిపాదించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం రూ.930 కోట్లతో మొత్తం 19 ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో రూ.627 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులు పూర్తి కాగా.. మరో ఏడు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. వీటికి కేంద్రం తరఫున ఇవ్వాల్సిన వాటా నిధుల్ని ఇచ్చేసినట్లు పార్లమెంటులో కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు. అలాగే రూ.302.86 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు ప్రస్తుతం నడుస్తున్నట్లు తెలిపారు.

వీటికి నిధుల కేటాయింపు ఎలాగో ఉంటుంది. అయితే మరిన్ని నిధుల కేటాయింపు విషయంలో మాత్రం అమరావతి స్మార్ట్ సిటీకి కేంద్రం మొండిచేయి చూపుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేశామని, మరిన్ని నిధులు ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం పార్లమెంటులో తేల్చిచెప్పేసింది. దీంతో అమరావతికి మద్దతుగా ఉంటామంటున్న బీజేపీ .. తమ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు ఇప్పించే పరిస్ధితి లేదని తేలిపోయింది.
ఇప్పటికే వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత అమరావతిలో పనులు దాదాపుగా నిలిచిపోయాయి. కేంద్రం నిధులిస్తున్న ప్రాజెక్టులకూ రాష్ట్రవాటా నిధుల విడుదల లేదు. దీంతో ఇక్కడ కొత్త ప్రాజెక్టులు వచ్చేలా లేవు. సుప్రీంకోర్టులో అమరావతి విషయం తేలే వరకూ ఈ ప్రాజెక్టులు కానీ నిధులు కానీ ఇచ్చిపుచ్చుకునే పరిస్దితి కనిపించడం లేదు. దీంతో ఇక్కడి రైతులు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఏదైనా ప్రకటన చేద్దామన్నా సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రభుత్వాలకు అడ్డంకిగా మారడం ఖాయం.












Click it and Unblock the Notifications