కీలక నియోజకవర్గాల్లో సీన్ ఛేంజ్ - వారి ఎంట్రీతో గుబులు..!!
ఏపీలో ఎన్నిక లెక్కలు మారుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పోరు హోరాహోరీగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. గెలుపు పైన రెండు వైపులా ధీమా కనిపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి అభ్యర్దులు పోటీ చేస్తున్న పలు చోట్ల రెబల్స్ పోటీలో నిలిచారు. అదే సమయంలో కీలక నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్దుల పేర్లతో ఉన్న వారే స్వతంత్రులుగా బరిలోకి దిగారు.
పూర్తయిన నామినేషన్లు
ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. పరిశీలన జరుగుతోంది. అయితే, పలు ఆసక్తి కర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్దులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారి పేర్లతోనే కొందరు స్వతంత్ర అభ్యర్దులుగా నామినేషన్లు దాఖలు చేసారు. ఇది ప్రధాన పార్టీల అభ్యర్దులకు ఇబ్బందిగా మారుతోంది. జనసేన గుర్తు గాజు గ్లాసు పైన కొత్త సమస్య ఆ పార్టీ అభ్యర్దులను వెంటాడుతోంది. జనసేన బరిలో లేని చోట గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులకు కేటాయిస్తున్నారు. ఎంపీ అభ్యర్దులుగా జనసేన అభ్యర్దులు పోటీ చేస్తున్న పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమస్య పార్టీ అభ్యర్దుల గెలుపు ఓటముల పైన ప్రభావం చేసే ఛాన్స్ ఉంది.

అభ్యర్దుల్లో టెన్షన్
తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పోలిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. ఈ సారి గెలుపు పైన బొలిశెట్టి భారీగా ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ వేయగా, దాదాపు అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి వల్లభనేని మోహన్ శ్రీకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక..తిరువూరు(ఎస్సీ)లో టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. దాదాపు ఇదే పేరుతో ఉన్న కొలికపోగు శ్రీను అనే వ్యక్తి జాతీయ జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
ఫలితం మార్చేస్తారా
ఇక, అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ నామినేషన్ వేశారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదే పేరుతో ఉన్న బోయిన బుద్ధ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వేశారు. అదే పేరుతో ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయటంతో వీరి ప్రభావం ఓటింగ్ సమయంలో ఎంతో కొంత ఉంటుందనే వాదన ఉంది. దీంతో..వారితో నామినేషన్ల ఉపసంహరణ దిశగా ప్రధాన పార్టీల అభ్యర్దులు ప్రయత్నాలు ముమ్మరం చేసారు.












Click it and Unblock the Notifications