తిరుపతి స్విమ్స్ లో ఇకపై: వరప్రదాయిని
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 75,104 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,896 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.66 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుపతిలోని ప్రఖ్యాత శ్రీవేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ ఆసుపత్రికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 22.01 కోట్ల రూపాయల విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందజేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఈ అత్యాధునిక వైద్య పరికరాలను ఆసుపత్రికి సమకూర్చింది.
ఐఓసీ అందజేసిన వైద్యపరికరాల్లో 14 కోట్ల రూపాయల విలువ చేసే మూడు టెస్లా ఎమ్‌ఆర్‌ఐ స్కానర్లు, 8 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 4డీ సిటి సిమ్యులేటర్ సిస్టమ్ ఉన్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యంత్రాలను స్విమ్స్ లో ఏర్పాటు చేశారు. స్విమ్స్ లో అత్యాధునిక ఎంఆర్ఐ, సిటీ స్కానర్ లను ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయలసీమలోనే అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన స్విమ్స్ లో మాత్రమే అత్యాధునికి యంత్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కేన్సర్ రోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్స్ లేకుండా వాటి కారణాలను సులువుగా గుర్తించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయని చెప్పారు.
మెదడు సంబంధిత ఇబ్బందులు, కేన్సర్ గుర్తింపు, కేన్సర్ ఏఏ అవయాలకు ఎంతెంత మోతాదులో సోకిందో ఆయా వైద్య పరికరాల ద్వారా సులభంగా గుర్తించవచ్చని బీఆర్ నాయుడు చెప్పారు. సంవత్సరానికి 2.5 లక్షల మందికిపైగా పేద రోగులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయని వివరించారు.
ఈ సందర్భంగా ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ- సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా స్విమ్స్ కు ఈ వైద్య పరికరాలను అందించామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. స్విమ్ డైరెక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ- టీటీడీ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా అత్యుత్తమ సేవలందిస్తున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications