ప్రపంచపు తొలి అనలాగ్ కంప్యూటర్! 2,100 ఏళ్ల కిందటే మిల్లీమీటర్ గేర్లతో అద్భుతం..
మానవ మేధస్సు పరిణామ క్రమంలో మానవాళి మైండ్ బ్లాక్ అయ్యే అద్భుతాలు ఎన్నో దాగి ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితమే గ్రహాల కదలికలు, గ్రహణాలు, చందమామ కళలను పక్కాగా లెక్కించే ఒక పరికరం ఉండేదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అదే 'యాంటికిథెరా మెకానిజం' (Antikythera Mechanism). దాదాపు 2,100 ఏళ్ల క్రితం ప్రాచీన గ్రీకులు రూపొందించిన ఈ పరికరాన్ని నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన "తొలి అనలాగ్ కంప్యూటర్"గా పిలుస్తున్నారు. కేవలం రాగి పళ్ళెములు, గేర్ల సహాయంతో పనిచేసే ఈ యంత్రం ప్రాచీన కాలపు సాంకేతిక రంగానికే ఒక మకుటాయమానంగా నిలిచింది.
మునిగిపోయిన నౌక.. వెలుగులోకి వచ్చిన అద్భుతం
క్రీస్తు పూర్వం 60వ సంవత్సరంలో గ్రీస్‌లోని యాంటికిథెరా ద్వీపం సమీపంలో ఒక ఓడ మునిగిపోయింది. శతాబ్దాల పాటు సముద్ర గర్భంలోనే ఉండిపోయిన ఆ ఓడ శిథిలాలు, 1900వ సంవత్సరంలో స్పాంజ్ సముద్ర జీవుల కోసం వేటకు వెళ్లిన డైవర్ల కంటపడ్డాయి. ఆ మునిగిన ఓడలో పాలరాతి విగ్రహాలు, బంగారు ఆభరణాలు, నాణేలు మెండుగా లభించాయి. అందులోనే ఒక పాత చెప్పుల పెట్టె పరిమాణంలో తుప్పుపట్టిన ఒక రాగి ముక్క లభించింది. ఆ సమయంలో ఎవరూ దాని ప్రాధాన్యతను గుర్తించలేదు. అయితే 1902లో ఏథెన్స్ జాతీయ పురావస్తు మ్యూజియంలో పనిచేసే వాలెరియోస్ స్టాయిస్ అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ విచిత్ర వస్తువును నిశితంగా పరిశీలించి, అది ఏదో సాధారణ లోహం కాదని, లోపల చిన్న చిన్న పళ్ళ చక్రాలు కలిగిన ఒక వినూత్న యంత్రమని కనుగొన్నారు.

ఒక్క మిల్లీమీటర్ గేర్లు.. అచ్చెరువొందిస్తున్న సైంటిస్టులు
సాధారణంగా ప్రాచీన కాలంలో గాలిమరలు, నీటిమరలకు మాత్రమే పెద్ద పెద్ద గేర్లను వాడేవారని పరిశోధకులు భావించేవారు. కానీ ఈ యంత్రంలో కేవలం ఒక్క మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే అతి చిన్న పళ్ళ చక్రాలను ఒకదానిపై ఒకటి అమర్చి (ఎపిసైక్లిక్ గేరింగ్ వ్యవస్థ) రూపొందించడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది. లండన్ యూనివర్సిటీ కాలేజ్ పరిశోధకుడు టోనీ ప్రీత్ దీని గురించి మాట్లాడుతూ.. "ఆ కాలంలోనే ఇంతటి ప్రతిభతో ఈ యంత్రాన్ని తయారుచేయడం నిజంగా నమ్మశక్యంగా లేదు" అని కొనియాడారు. క్రీస్తు పూర్వం 100 ప్రాంతంలో రూపొందిన ఈ పరికరం ఒక చిన్న చెక్క పెట్టెలో అమర్చబడి ఉండేదని, దీనికి ఉండే హ్యాండిల్‌ను తిప్పితే చాలు.. నక్షత్రాలు, గ్రహాల స్థానాలు, గ్రహణాలు, ఆఖరికి ప్రాచీన ఒలింపిక్స్ తేదీలు కూడా పక్కాగా తెలిసిపోయేవట.
ప్రాచీన ఖగోళ శాస్త్రం నుంచి యంత్ర పరిజ్ఞానం వైపు అడుగులు
ఈ అద్భుత యంత్రం ఏమీ ఉన్నట్టుండి ఊడిపడలేదు. ప్రాచీన బాబిలోనియన్, ఈజిప్షియన్ ఖగోళ శాస్త్ర జ్ఞానాన్ని గ్రీకులు వంటపట్టించుకుని ఈ యంత్ర రూపాన్ని డిజైన్ చేశారు. ప్రకృతి శక్తులు లేదా దేవుళ్ల కోపతాపాల వల్ల కాకుండా.. విశ్వం నిర్దిష్టమైన గణిత సూత్రాలు, నియమాల ప్రకారం నడుస్తుందని ఆనాటి గ్రీకు తత్వవేత్తలు విశ్వసించారు. పిథాగరస్ వంటి మేధావులు విశ్వాన్ని సంఖ్యలతో వివరించవచ్చని నిరూపించగా.. ఆ ఆలోచనా సరళికి సజీవ సాక్ష్యంగా ఈ గేర్ల యంత్రం రూపుదిద్దుకుంది. న్యూయార్క్ యూనివర్సిటీ చరిత్రకారుడు అలెక్సాండర్ జోన్స్ ప్రకారం.. నాటి కాలంలో ఇలాంటి పరికరాలు చాలా అరుదుగా తయారు చేసేవారని, వీటి తయారీకి నెలల సమయం పట్టడంతో ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారని భావిస్తున్నారు.
సాంకేతికత మాయమైందా? నేటి తరం నేర్చుకోవాల్సిన పాఠం
ఈ యంత్రం కనుగొనడం ద్వారా ఒక నిజాన్ని గ్రహించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎల్లప్పుడూ ఒకే సరళరేఖలో ముందుకు సాగదు; కొన్నిసార్లు ఒక యుగంలో సాధించిన ఉన్నతమైన జ్ఞానం ఆ తర్వాతి యుగాల్లో కాలగర్భంలో కలిసిపోవచ్చు. ప్రాచీన గ్రీకులు ఇంతటి సంక్లిష్టమైన ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక అనలాగ్ కంప్యూటర్‌ను తయారుచేశారంటే.. ఆ తర్వాత మళ్లీ అలాంటి యంత్రం రూపుదిద్దుకోవడానికి కొన్ని శతాబ్దాల సమయం పట్టింది. మనం అనుకునేదాని కంటే మన ప్రాచీనులు సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్నారని చెప్పడానికి ఈ 2000 ఏళ్ల నాటి 'యాంటికిథెరా మెకానిజం' ఒక సజీవ నిదర్శనం.














Click it and Unblock the Notifications
