రిజర్వేషన్ బెర్త్‌ల టైమింగ్స్ మార్చిన భారతీయ రైల్వే
భారతీయ రైల్వే ప్రతిరోజు కోటిమందికి పైగా ప్రయాణికులను గ్యమస్థానాలకు చేరవేస్తోంది. ఎప్పటికప్పుడు నిబంధనలను సరిచేస్తూ ఉండే రైల్వే తాజాగా మరో నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రయాణికులు నిద్రపోయే సమయ వేళలను మార్చింది. స్లీపర్, ఏసీ కోచ్ ల్లో మిడిల్, సైడ్ లోయర్ బెర్త్ లపై ఎక్కువసేపు నిద్రించవద్దని తెలిపింది. ఈమేరకు నియమాలను మార్చింది. దీనివల్ల ఇతర బెర్త్ ల ప్రయాణికులకు ఊరట కలగనుంది.
ఫిర్యాదులు అందుతుండటంతో..
రిజర్వేషన్ బోగీల్లో మిడిల్ బెర్త్ ఉంటుందనే విషయం తెలిసిందే. దీన్ని రాత్రివేళ ప్రయాణికులు నిద్రపోయేందుకు ఉపయోగించుకోవాలి. పగటివేళల్లో కూడా దీన్ని ఓపెన్ చేసి పడుకోవడంవల్ల కింద కూర్చునే ప్రయాణికులకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. దీనిపై తరుచుగా రైల్వేకు ఫిర్యాదులు అందుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. 'ఇండియన్ రైల్వేస్ కమర్షియల్ మ్యాన్యువల్'లోని మొదటి వాల్యూమ్‌లో 652వ పేరాను సవరించింది.

మిడిల్ బెర్త్ కు సమయ వేళలు
మిడిల్ బెర్త్ ప్రయాణికులు ఇకనుంచి 8 గంటలే పడుకోవాలి. అంతకుముందు ఈ సమయం 9 గంటలుగా ఉండేది. రాత్రి 9.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు నిద్రపోవాలి. అయితే మారిన నిబంధనల ప్రకారం రాత్రి 10.00 గంటలకే మిడిల్ బెర్త్ ను ఓపెన్ చేయాలి. ఉదయం 6.00 గంటలకు బెర్త్ ను మూసేయాలి. ఇలా మూసేయాలని అడిగే హక్కు లోయర్ బెర్త్ ప్రయాణికులు ఉంది. ఈ విషయాన్ని గమనించాలని రైల్వే సూచించింది.
సైడ్ లోయర్ బెర్త్ సమయ వేళలు
సైడ్ లోయర్ బెర్త్ కు సంబంధించి కూడా నియమాలు మార్చారు. పగటి సమయంలో సైడ్ అప్పర్ బెర్త్ ప్రయాణికులు లోయర్ బెర్త్ లో కూర్చోవచ్చు. ఆర్ఏసీ టికెట్ ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల సమయంలో ఈ బెర్త్ లో కూర్చోవడానికి పై బెర్త్ ప్రయాణికులకు అనుమతి లేదు. అయితే అంగవైకల్యం కలిగిన వారు, గర్భిణులు, వ్యాధిగ్రస్తులు ఎక్కువసేపు నిద్రించడానికి వీలుగా తోటి ప్రయాణికులు అనుమతించాలని భారతీయ రైల్వే సూచించింది












Click it and Unblock the Notifications