సిగ్గుపడుతున్నాం: బాలకృష్ణపై రవికుమార్ నిప్పులు
అనంతపురం: తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణపై తూముకుంట పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు రవికుమార్ తీవ్రంగా మండిపడ్డారు. కార్మికుల సమస్యలను బాలకృష్ణ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
బాలకృష్ణకు ఓటేసినందుకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన బాలకృష్ణపై విమర్శలు చేశారు. తూముకుంట పారిశ్రామిక వాడలో 93 ఫ్యాక్టరీలున్నాయని ఆయన చెప్పారు.

తూముకుంట పారిశ్రామిక వాడలోని పరిశ్రమల యజమానులు కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన చెప్పారు. వేతనాల పెంపు కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే యాజమాన్యాలు పోలీసులను ఉసిగొల్పి 11 మంది కార్మికులపై అక్రమ కేసులు పెట్టించాయని ఆయన ఆరోపించారు.
అయినా శాసనసభ్యుడు బాలకృష్ణ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించేందుకు బాలకృష్ణ ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఓపిడిఆర్ సంఘం రాష్ట్రాధ్యక్షుడు శ్రీనివాసులు, రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications