YS Jagan- Adani : వైఎస్ జగన్ తో గౌతం అదానీ భేటీ-కీలకచర్చలు- అజెండా అదేనా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతం అదానీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి వచ్చారు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న గౌతమ్ అదాని.. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడకు ఆయన వెళ్లారు. అక్కడి నుంచి తాడేపల్లి చేరుకున్నారు.
ఏపీలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులతో పాటు పలు ప్రాజెక్టుల్ని అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. అలాగే వైజాగ్ లో మెగా డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు కూడా అదానీ గ్రూప్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే వైజాగ్ లో ఈ ఏడాది నిర్వహించిన పెట్టుబడుదల సదస్సు కూడా హాజరైన అదానీ గ్రూప్ ప్రతినిధులు.. పలు ప్రతిపాదనలు ఇచ్చారు. వీటిపై చర్చించి ఖరారు చేసేందుకు గౌతం అదానీ ఇవాళ సీఎం జగన్ తో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పోర్టులతో పాటు పవర్ ప్లాంట్లు, అదానీ విల్మార్ వంటనూనెల పరిశ్రమలు అదానీకి ఉన్నాయి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో అదానీ గ్రూప్ దీన్ని సొంతం చేసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ గౌతం అదానీ.. సీఎం జగన్ తో ఏం చర్చించబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఏపీలో పలు రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న అదానీ గ్రూపుకు వైసీపీ సర్కార్ సహకారం అందించేందుకు సిద్దంగానే ఉంది. దీంతో జగన్-అదానీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్నికలకు ముందు అదానీ గ్రూప్ నుంచి ఏపీకి శుభవార్త అందించే అది కచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ కాబోతోంది. కాబట్టి ఇవాళ్టి చర్చల్లో గతంలో అంగీకరించిన ప్రతిపాదనలతో పాటు కొత్త ప్రాజెక్టులపైనా చర్చించబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ చర్చల తర్వాత దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications